అక్షరటుడే, వెబ్‌డెస్క్ : KTR | సీఎం రేవంత్‌రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ విమర్శలు చేశారు. ఆయనది తుగ్లక్ పాలన అన్నారు. తెలంగాణ (Telangana) అస్తిత్వాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.
బీఆర్ఎస్ ఆధ్వర్యంలో సికింద్రాబాద్ బచావో పేరిట శనివారం శాంతిర్యాలీకి పిలుపునిచ్చారు. అయితే ఈ ర్యాలీకి అనుమతి లేదని పోలీసులు అడ్డుకున్నారు. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలను అరెస్ట్ చేశారు. దీంతో కేటీఆర్ తెలంగాణ భవన్ వద్ద మీడియాతో మాట్లాడారు. ఏళ్లుగా జంట నగరాలుగా హైదరాబాద్–సికింద్రాబాద్ ప్రత్యేక గుర్తింపు పొందాయన్నారు. అయితే సికింద్రాబాద్ అస్తిత్వాన్ని ప్రభుత్వం దెబ్బ తీస్తోందన్నారు. సికింద్రాబాద్ (Secunderabad)ను చరిత్రలో లేకుండా చేయాలని చూస్తున్నారని ఆరోపించారు.
KTR | ద్రోహులుగా మిగులుతారు
రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) పాలన పిచ్చి తుగ్లక్‌లా ఉందన్నారు. అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ వాటిని అమలు చేయడం లేదన్నారు. ఆరు గ్యారెంటీలు అటకెక్కించారన్నారు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని తీసేసి కాంగ్రెస్ తల్లిని పెట్టారని పేర్కొన్నారు. తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బ తీసినందుకు కాంగ్రెస్ పార్టీ నాయకులు (Congress Party Leaders), రేవంత్ రెడ్డి తెలంగాణ ద్రోహులుగా మిగిలిపోతారని అన్నారు. సికింద్రాబాద్‌కు అస్తిత్వం లేకుండా చేస్తున్నారని విమర్శించారు. సికింద్రాబాద్ అస్తిత్వాన్ని కాపాడేందుకు స్థానిక ప్రజలు చేస్తున్న శాంతియుత నిరసన ర్యాలీని అడ్డుకున్నారన్నారు. ఇదేనా రాహుల్ గాంధీ (Rahul Gandhi) చెప్పే రాజ్యంగా రక్షణ అంటే అని ప్రశ్నించారు. కచ్చితంగా కోర్టులో అనుమతి తెచ్చుకుని, మరోసారి ర్యాలీ నిర్వహిస్తామని ఆయన స్పష్టం చేశారు.
KTR | అధికార వికేంద్రీకరణ కోసం..
అధికార వికేంద్రీకరణ జరగాలని 33 జిల్లాలను ఏర్పాటు చేశామని కేటీఆర్ తెలిపారు. హైదరాబాద్ (Hyderabad) నగరంలో గతంలో 24 సర్కిళ్లు ఉంటే 30 చేశామని, 4 జోన్లు ఉంటే 6కు పెంచామన్నారు. హైదరాబాద్ అస్తిత్వాన్ని తాము ఎప్పడు ముట్టుకోలేదన్నారు. కానీ ప్రస్తుతం సీఎం రేవంత్‌రెడ్డి సికింద్రాబాద్ అస్తిత్వాన్ని తొలగించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. జంట నగరాల్లో ఒక్క ఇల్లు నిర్మించని ప్రభుత్వం కూలగొట్టడమే పనిగా పెట్టుకుందన్నారు. ఫ్యూచరే లేని ముఖ్యమంత్రి ఫ్యూచర్ సిటీ కడతానంటే ఎవరు నమ్ముతారని ఎద్దేవా చేశారు.