అక్షరటుడే, వెబ్‌డెస్క్ : KTR | హైదరాబాద్ నగరం పరిధిలోని వేల ఎకరాల భూములను కాజేసేందుకు సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) కుట్ర పన్నారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఆరోపించారు. ఇటీవల మంత్రివర్గం ఆమోదించిన హైదరాబాద్ పారిశ్రామిక భూ పరివర్తన విధానం కాంగ్రెస్‌కు, రేవంత్ రెడ్డికి వ్యక్తిగతంగా ఒక ఏటీఎంగా మారిందని ఆయన అన్నారు.
తెలంగాణ భవన్ (Telangana Bhavan)లో శుక్రవారం కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. మంత్రివర్గం ఆమోదించిన భూ పరివర్తన విధానంతో హైదరాబాద్‌లోని 9,292 ఎకరాల భూమి ఇప్పుడు ప్రమాదంలో ఉందన్నారు. ఇది హైదరాబాద్‌లోని పారిశ్రామిక భూములను క్రమబద్ధీకరించడం పేరుతో జరిగిన రూ.5 లక్షల కోట్ల భూ కుంభకోణం అని ఆరోపించారు. భారతదేశ చరిత్రలో అతిపెద్ద భూ కుంభకోణంగా దీనిని అభివర్ణించారు.
KTR | పాలసీ ముసుగులో..
పాలసీ ముసుగులో ప్రభుత్వ భూమిని దోచుకునేందుకు కాంగ్రెస్ చూస్తోందన్నారు. అయితే భూములను కాపాడటానికి BRS చట్టపరమైన చర్యలు తీసుకుంటుందని ఆయన హెచ్చరించారు. నగరంలో ఉన్న పారిశ్రామిక వాడల భూములను, రేవంత్ రెడ్డి తన బంధువులు, స్నేహితులకు కట్టబెడుతున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఇండస్ట్రియల్ భూములు రెగ్యులరైజ్ చేయడానికి 100శాతం, 200 శాతం శాతం ఫీజు చెల్లించాలని నిబంధన పెట్టామన్నారు. కానీ రేవంత్ రెడ్డి, AV.రెడ్డి, కొండల్ రెడ్డి, తిరుపతి రెడ్డి లాంటి బడా బాబులకు కేవలం 30శాతం ఫీజు చెల్లిస్తేనే రెగ్యులరైజ్ చేస్తామని కేబినెట్ సమావేశంలో ఆమోదం తెలిపారని ఆరోపించారు. 9,295 ఎకరాల ప్రభుత్వ భూమిని అతి తక్కువ ధరకు రెగ్యులరైజ్ చేసే కుట్ర చేస్తున్నారన్నారు.
KTR | అరెస్ట్ చేసే ధైర్యం చేయదు
ప్రభుత్వం తనను అరెస్ట్ చేసే ధైర్యం చేయదని కేటీఆర్ అన్నారు. ఫార్మూల ఈ –కారు రేస్ కేసు (Formula E car Race Case)లో కేటీఆర్ ప్రాసిక్యూషన్‌కు గవర్నర్ అనుమతించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయనను అరెస్ట్ చేస్తారని వార్తలు వచ్చాయి. దీనిపై కేటీఆర్ స్పందిస్తూ.. చట్టం తన పని తాను చేస్తుందన్నారు. తనను అరెస్టు చేసే ధైర్యం ప్రభుత్వం చేయదన్నారు. తాను ఏ తప్పు చేయలేదని చెప్పారు.
KTR | దానం నాగేందర్‌తో రాజీనామా
కాంగ్రెస్ ప్రభుత్వం ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ (Khairatabad MLA Danam Nagender)తో రాజీనామా చేయించే యోచనలో ఉందని కేటీఆర్ అన్నారు. అనర్హత వేటు పడితే పరువు పోతుందని రాజీనామాకు అవకాశం ఇస్తున్నారని విమర్శించారు. సాంకేతిక సాకులతో కడియం శ్రీహరిని కాపాడాలని చూస్తున్నారని చెప్పారు. ఖైరతాబాద్‌లో త్వరలో ఉప ఎన్నికలు వస్తాయని ఆయన పేర్కొన్నారు.
