అక్షరటుడే, వెబ్‌డెస్క్: Medaram Jathara | ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం మహా జాతరకు (Medaram Maha Jathara) సమీపిస్తోంది. దీంతో అభివృద్ధి పనులు వేగంగా సాగుతున్నాయి.
రాష్ట్ర ప్రభుత్వం మేడారం జాతరను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. శాశ్వత అభివృద్ధి పనులు చేపడుతోంది. సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) ఈ పనులకు శంకుస్థాపన చేశారు. త్వరలో పనులు పూర్తి కానున్నాయి. దీంతో వాటిని ప్రారంభించడానికి సీఎం ఈ నెల 20న మేడారం రానున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి (Minister Ponguleti Srinivas Reddy) తెలిపారు. ముఖ్యమంత్రి మేడారంను సందర్శించి, రాత్రిపూట బస చేసి పూర్తయిన ఆలయ పునరుద్ధరణ పనులను ప్రారంభిస్తారని మంత్రి ప్రకటించారు.
Medaram Jathara | పనుల పరిశీలన
మేడారంలో కొనసాగుతున్న పనులను మంత్రి పొంగులేటి, మరో మంత్రి సీతక్కతో కలిసి ఆదివారం పరిశీలించారు. సమ్మక్క–సారలమ్మ ఆలయ ప్రాంగణం ఆదివాసీ సంస్కృతికి శాశ్వత చిహ్నంగా అభివృద్ధి చెందుతోందన్నారు. ఆలయ ల్యాండ్‌స్కేపింగ్, ప్రధాన ఆర్చ్ నిర్మాణం, క్యూ లైన్ షెడ్‌లు, రోడ్డు అభివృద్ధి పనులు, జంపన్న వాగు స్నాన ఘాట్ తదితర పనులను పరిశీలించారు. మహిళల నేతృత్వంలోని జీవనోపాధిని బలోపేతం చేస్తూ జంపన్న వాగు సమీపంలో ఇందిరా మహిళా శక్తి వెదురు చికెన్ క్యాంటీన్‌ను ఆయన ప్రారంభించారు.
Medaram Jathara | 12 నాటికి పూర్తి చేయాలి
జనవరి 12 నాటికి అన్ని సివిల్ పనులు, క్యూ లైన్లు, షెడ్లను పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు. ఆక్రమణలపై కఠిన చర్యలు తీసుకోవాలని, నిరంతరాయంగా తాగునీరు అందించాలన్నారు. సంక్రాంతి ముందు నుంచి జనవరి 31 వరకు మేడారం ప్రాంతం మొత్తం విద్యుత్ దీపాలతో నిండి ఉండాలని ఆదేశించారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మేడారం జాతరను నిర్వహిస్తున్నామని, కోట్లాది మంది భక్తులు వస్తారన్నారు. వారికి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.