అక్షరటుడే, కామారెడ్డి : Heavy Rains | కామారెడ్డి జిల్లాను అతి భారీ వర్షాలు(Heavy Rains) ముంచెత్తుతున్నాయి. ఒక్క రోజులోనే రికార్డు స్థాయిలో వర్షం కురిసింది. దీంతో కామారెడ్డి జిల్లా అతలాకుతలం అయ్యింది. నదులు, వాగులు ఉప్పొంగి ప్రవహిస్తుండగా.. పలు చోట్ల రోడ్లు తెగిపోయాయి.
జాతీయ రహదారిపై సైతం దెబ్బతిన భారీగా ట్రాఫిక్ నిలిచిపోయిన విషయం తెలిసిందే. అంతేకాకుండా పలుచోట్ల వరదల్లో పలువురు చిక్కుకోవడంతో అధికారులు, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది కాపాడారు. జిల్లాపై వరదల ప్రభావం ఎన్నడూ ఎరుగని రీతి కనిపించింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కొద్దిసేపట్లో కామారెడ్డి జిల్లాకు రానున్నారు. ఇప్పటికే ఆయన వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ రివ్యూ చేపడుతున్నారు. అనంతరం కామారెడ్డి జిల్లా కేంద్రానికి రానున్నారు. సీఎం రాకకు సంబంధించి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) జిల్లా అధికారులతో రివ్యూ చేపట్టనున్నారు.
Heavy Rains | ప్రభుత్వం అండగా ఉంటుంది: ఇన్ఛార్జి మంత్రి సీతక్క
వరద బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని జిల్లా ఇన్ఛార్జి మంత్రి సీతక్క(Minister Seethakka) తెలిపారు. ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ(Shabbir Ali)తో కలిసి గురువారం కామారెడ్డి హౌసింగ్ బోర్డు, జీఆర్ కాలనీల్లో పర్యటించారు. హౌసింగ్ బోర్డు వద్ద వరద ధాటికి దెబ్బతిన్న బ్రిడ్జిని స్వయంగా పరిశీలించారు.
అనంతరం జీఆర్ కాలనీ(GR Colony)లో ముంపునకు గురైన ఇళ్లలో బాధితులను కలిసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. కాలనీలోకి వస్తున్న నీటి ప్రవాహాన్ని పరిశీలించారు. బాధిత కుటుంబాలకు షబ్బీర్ అలీ ఫౌండేషన్ ద్వారా పండ్లు, ఆహార ప్యాకెట్లను పంపిణీ చేశారు.
అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ఇంతటి విపత్తు జరగడం బాధాకరమన్నారు. కామారెడ్డి(Kamareddy), ఎల్లారెడ్డి నియోజకవర్గాల్లో అర్ధరాత్రి మొదలైన వర్షం తెల్లారేసరికి బీభత్సం సృష్టించడం ఊహించని పరిణామమని తెలిపారు. వరద ధాటికి ఒక డాక్టర్, మరొక ఇద్దరు చనిపోయినట్టుగా తెలిసిందన్నారు. వారి కుటుంబాలను ఆదుకుంటామని సీఎం చెప్పారన్నారు. వరద ఉధృతి తీవ్రంగా ఉన్నట్టు గుర్తించామన్నారు.
వరదలపై ప్రభుత్వం ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షలు చేపడుతుందన్నారు. ప్రాణ నష్టం ఎక్కువగా జరగకపోవడం సంతోషకరమైన విషయమని పేర్కొన్నారు. ఆస్తినష్టం బాగానే ఉన్నట్టుగా తెలుస్తోందన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దన్నారు. అధికారులతో సమీక్ష చేపట్టి సహాయక చర్యలను ముమ్మరం చేస్తామని పేర్కొన్నారు. ఆస్తినష్టం వివరాలను అధికారులతో సమీక్షిస్తామని తెలిపారు. మంత్రి వెంట ఎంపీ సురేష్ షెట్కార్(MP Suresh Shetkar), కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్(Collector Ashish Sangwan), ఎస్పీ రాజేష్ చంద్ర(SP Rajesh Chandra) ఇతర అధికారులు ఉన్నారు.