అక్షరటుడే, ఎల్లారెడ్డి: CM Revanth reddy | కామారెడ్డిలో భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. అలాగే ఎల్లారెడ్డి (Yellareddy), నిజాంసాగర్ (nizamsagar), బాన్సువాడ (banswada) ప్రాంతాల్లోనూ వర్షాలు జనజీవనాన్ని స్తంభింపజేశాయి. ప్రాజెక్టులకు వరద పోటెత్తడంతో దిగువకు వరదను విడుదల చేశారు. అయితే ప్రాజెక్టుల పరీవాహక ప్రాంతాల్లో పంటపొలాలు నీటమునిగాయి.
CM Revanth reddy | క్షేత్రస్థాయిలో సీఎం పర్యటన
రాష్ట్రంలో ఎక్కడాలేని విధంగా కామారెడ్డిలో వరద కారణంగా అపారనష్టం వాటిల్లింది. వర్ష బీభత్సం సృష్టించిన సమయంలో సీఎం రేవంత్రెడ్డి ఏరియాల్ సర్వే చేశారు. తాజాగా ఆయన ఎల్లారెడ్డిలో ముంపునకు గురైన పలు ప్రాంతాలను క్షేత్రస్థాయిలో పరిశీలించనున్నారు.
ఈనెల 4న లింగంపేట (Lingampet) మండలానికి హెలికాప్టర్ ద్వారా వచ్చి అక్కడి నుంచి రోడ్డుమార్గం ద్వారా ఎల్లారెడ్డి మండలంలోని కళ్యాణి ప్రాజెక్టు (kalyani Project), బొగ్గుగుడిసె (Boggu gudise) ప్రాంతాన్ని పరిశీలిస్తారు. అనంతరం నాగిరెడ్డిపేట (Nagireddy Pet) మండలం పోచారం ప్రాజెక్టు వద్ద వరద తాకిడికి కొట్టుకుపోయిన వంతెనను, ప్రాజెక్టు ఓవర్ హెడ్ వద్ద మట్టి కొట్టుకుపోయిన ప్రాంతాన్ని సీఎం పరిశీలించనున్నారు. ఆ తర్వాత అగ్రికల్చర్ కళాశాలలో అధికారులతో రివ్యూ మీటింగ్ నిర్వహించనున్నారు. కాగా.. సీఎం పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు పర్యవేక్షిస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు విద్యుత్ సంబంధిత ఏర్పాట్లను ట్రాన్స్కో ఎస్ఈ పర్యవేక్షిస్తున్నట్లు సమాచారం.