అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Jubilee Hills election | జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలుపు కోసం కాంగ్రెస్ సర్వ శక్తులు ఒడ్డుతోంది. ఈ స్థానాన్ని ఎలాగైనా కైవసం చేసుకోవాలని పార్టీ భావిస్తుంది.
కాంగ్రెస్ (Congress) అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో ఆ పార్టీ ఈజీగా గెలుపొందింది. అయితే ఆ అసెంబ్లీ ఎన్నికలు జరిగిన కొన్ని నెలలకే ఉప ఎన్నికలు వచ్చాయి. దీంతో ప్రభుత్వ పాలనపై ఆ ఎన్నికల్లో చర్చ జరగలేదు. ప్రజలు కూడా సిట్టింగ్ బీఆర్ఎస్ (BRS)ను కాదని అధికారంలో ఉన్న పార్టీని గెలిపించారు. అయితే ప్రస్తుత ఉప ఎన్నికలు కాంగ్రెస్ రెండేళ్ల పాలనకు రెఫరండంగా భావిస్తున్నారు. ఈ ఎన్నికల్లో ఓడిపోతే రేవంత్‌రెడ్డి పాలనకు ప్రజల ఆమోదం లేదని ప్రచారం జరిగే అవకాశం ఉంది. ఈ క్రమంలో జూబ్లీహిల్స్ స్థానాన్ని గెలిచి తీరాలని ఆ పార్టీ చర్యలు చేపడుతోంది. ఇప్పటికే మంత్రులు అక్కడే మకాం వేశారు. నిత్యం ప్రచారం చేస్తున్నారు. సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) సైతం ప్రచారంలో పాల్గొనున్నారు.
Jubilee Hills election | నాలుగు రోజుల పాటు..
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ దూకుడు పెంచింది. ఇప్పటికే మంత్రులు ఇంటింటికి తిరుగుతూ కాంగ్రెస్‌కు ఓటు వేయాలని కోరుతున్నారు. సీఎం రేవంత్‌రెడ్డి సైతం నాలుగు రోజుల పాటు నియోజకవర్గంలో ప్రచారం చేయనున్నారు. రెండు విడతల్లో ఆయన ప్రచారం ఉంటుంది. ఈనెల 30,31 తేదీల్లో నాలుగు డివిజన్లలో ప్రచారం చేయనున్నారు. నవంబర్ 4,5 తేదీల్లో మరోసారి ప్రచారంలో పాల్గొంటారు. సీఎంతో భారీ రోడ్డు షోలు, సమావేశాలు నిర్వహించాలని కాంగ్రెస్ భావిస్తోంది.
Jubilee Hills election | కేసీఆర్ సైతం..
కొంతకాలంగా ఫామ్‌హౌస్‌కే పరిమితమైన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) సైతం జూబ్లీహిల్స్‌లో ప్రచారం చేయనున్నట్లు సమాచారం. ఆయనతో సభ పెట్టించాలని పార్టీ భావిస్తున్నట్లు తెలిసింది. ఈ ఎన్నికల్లో ఓడిపోతే ఆ ప్రభావం స్థానిక సంస్థల ఎన్నికలపై పడుతుంది. దీంతో బీఆర్ఎస్ సైతం ఉప ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. మాజీ మంత్రులు కేటీఆర్ (KTR), హరీశ్‌రావు (Harish Rao) ఇప్పటికే ప్రచారంలో దూసుకుపోతున్నారు.

