HomeతెలంగాణCM Revanth Reddy | పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలతో సీఎం రేవంత్​రెడ్డి భేటీ

CM Revanth Reddy | పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలతో సీఎం రేవంత్​రెడ్డి భేటీ

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : CM Revanth Reddy | ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి బీఆర్​ఎస్​ (BRS) నుంచి కాంగ్రెస్​లో చేరిన 9 మంది ఎమ్మెల్యేలతో ఆదివారం భేటీ అయ్యారు.

కాంగ్రెస్​ అధికారంలోకి వచ్చిన తర్వాత పది మంది బీఆర్​ఎస్​ ఎమ్మెల్యేలు హస్తం గూటికి చేరిన విషయం తెలిసిందే. వీరిపై అనర్హత వేటు వేయాలని బీఆర్​ఎస్​ సుప్రీంకోర్టు (Supreme Court)ను ఆశ్రయించింది. బీఆర్​ఎస్​ నేతల పిటిషన్లపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుదీర్ఘంగా విచారణ చేపట్టింది. అనర్హత విషయంలో మూడు నెలల్లో నిర్ణయం తీసుకోవాలని స్పీకర్​కు ధర్మాసనం సూచించింది. ఈ మేరకు స్పీకర్​ గడ్డం ప్రసాద్​ పార్టీ మారిన ఎమ్మెల్యేలకు నోటీసులు పంపించారు. ఈ క్రమంలో వారితో సీఎం భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.

CM Revanth Reddy | హాజరైన 9 మంది ఎమ్మెల్యేలు

ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావ్ (భద్రాచలం), కడియం శ్రీహరి(స్టేషన్​ ఘన్​పూర్​), దానం నాగేందర్​ (ఖైరతాబాద్​), పోచారం శ్రీనివాస్​రెడ్డి (బాన్సువాడ), బండ్ల కృష్ణమోహన్​రెడ్డి(గద్వాల), కాలే యాదయ్య (చేవేళ్ల), సంజయ్​ కుమార్​ (జగిత్యాల), ప్రకాశ్​గౌడ్​ (రాజేంద్రనగర్​), అరికపూడి గాంధీ (శేరిలింగంపల్లి), మహిపాల్​రెడ్డి (పటాన్​చెరు) కాంగ్రెస్​లో చేరిన విషయం తెలిసిందే. వీరిలో కడియం శ్రీహరి మినహా మిగతా 9 మంది సీఎం రేవంత్​రెడ్డి నివాసంలో భేటీకి హాజరు అయ్యారు.

CM Revanth Reddy | అభివృద్ధి కోసమే..

బీఆర్​ఎస్​లో చేరిన ఎమ్మెల్యేలకు అనర్హత భయం పట్టుకుంది. స్పీకర్​ నోటీసులు (Speaker Notices) ఇవ్వడంతో ఇప్పటికే ఒకరిద్దరు ఎమ్మెల్యేలు వివరణ ఇచ్చారు. సాంకేతిక అంశాల ఆధారంగా అనర్హత నుంచి తప్పించుకోవాలని వారు భావిస్తున్నారు. ఈ మేరకు తాము బీఆర్​ఎస్​లోనే ఉన్నామని నోటీసులకు వివరణ ఇస్తున్నారు. కేవలం అభివృద్ధి కోసమే సీఎం రేవంత్​రెడ్డిని కలిశామని చెబుతున్నారు. గద్వాల ఎమ్మెల్యే (Gadwal MLA) కృష్ణమోహన్​రెడ్డి తాను బీఆర్​ఎస్​లోనే ఉన్నానని, కాంగ్రెస్​ కండువా కప్పుకోలేదని స్పీకర్​కు వివరణ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేలతో సీఎం భేటీ కావడం గమనార్హం.

CM Revanth Reddy | ధైర్యం నింపడానికేనా..

పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు ఆందోళన చెందుతున్న నేపథ్యంలో వారిలో ధైర్యం నింపడానికి సీఎం సమవేశం నిర్వహించినట్లు సమాచారం. స్పీకర్​ నోటీసులపై ఎలా స్పందించాలనే విషయం వారితో చర్చించినట్లు తెలుస్తోంది. గతంలో సీఎం రేవంత్​రెడ్డి ఉప ఎన్నికలు రావని పలుమార్లు వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో అనర్హత పడదని ఆయన ఎమ్మెల్యేలకు భరోసా ఇచ్చినట్లు సమాచారం.