అక్షరటుడే, వెబ్‌డెస్క్ : CM Revanth Reddy | మంత్రి కొండా సురేఖ భర్త కొండా మురళి (Konda Murali) ఎపిసోడ్‌పై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. కొండా మురళి ఇటీవల మంత్రి పొంగులేటిపై అధిష్టానానికి ఫిర్యాదు చేశారు.
వరంగల్ కాంగ్రెస్‌లో కొంతకాలంగా కొండా దంపతులకు ఇతర ఎమ్మెల్యేలకు పొసగడం లేదు. కొండా మురళిపై పలువురు ఎమ్మెల్యేలు క్రమ శిక్షణ కమిటీకి కూడా ఫిర్యాదు చేశారు. దీంతో ఆ కమిటీ ఛైర్మన్ మల్లు రవి మురళితో సమావేశమై అందరు కలిసి పని చేయాలని సూచించారు. దీనికి మురళి కూడా ఒప్పుకున్నారు. అయితే కొండా మురళి కొంతకాలంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిపై విమర్శలు చేస్తున్నారు. తాజాగా సైతం ఆయనపై ఫిర్యాదు చేశారు.
CM Revanth Reddy | టెండర్లలో జోక్యం చేసుకున్నారని..
మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి (Minister Ponguleti Srinivas Reddy) అన్ని విషయాల్లో జోక్యం చేసుకుంటున్నారని కొండా మురళి ఆరోపించారు. ఆయన వరంగల్ రాజకీయాల్లో తలదూరుస్తున్నారని హైకమాండ్‌కు ఫిర్యాదు చేశారు. అంతేగాకుండా మేడారం టెండర్లలోనూ పొంగులేటి సొంత కంపెనీకి కాంట్రాక్టులు ఇప్పించుకున్నారని ఆరోపించారు. ఆయనకు సంబంధం లేని దేవాదాయ శాఖలోనూ జోక్యం చేసుకుంటున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పనులపై వివాదం చేయడమేంటని సీఎం ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం.
మేడారం (Medaram)లో అభివృద్ధి పనులకు సీఎం ఇటీవల శంకుస్థాపన చేశారు. మహా జాతరలోపు పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. సమయం తక్కువగా ఉండటంతో వేగంగా పనులు చేపట్టాలని ఆదేశించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పనులు చేపడుతుండగా.. కొండా మురళి తీరుతో ప్రభుత్వానికి, పార్టీకి నష్టం జరుగుతుందని సీఎం పేర్కొన్నట్లు తెలిసింది. దీనిపై ఆయన కాంగ్రెస్ హైకమాండ్కి పూర్తి నివేదిక పంపినట్లు సమాచారం. మరి మురళిపై పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.