అక్షరటుడే, వెబ్‌డెస్క్ : KTR | ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై (Chief Minister Revanth Reddy) బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. రేవంత్ రెడ్డికి నరనరాన విషం తప్ప మూసీని ప్రక్షాళన చేయాలన్న విజన్ ఏమాత్రం లేదన్నారు.
కలుషితమైన మూసీ (Musi River) కన్నా ముఖ్యమంత్రి ఉపయోగించే భాష నుంచే ఎక్కువ కంపు కొడుతోందని కేటీఆర్ (KTR) అన్నారు. తన అక్రమ సంపాదనకు అడ్డువస్తున్నారని తమ పార్టీపై, మూసీని వ్యతిరేకిస్తున్న ప్రజలపై కడుపులో కొండంత విషం పెట్టుకున్నారని ఆరోపించారు. డీపీఆర్ సిద్ధం కావడానికి ఇంకా ఏడాది పడుతుందని అంటున్న ముఖ్యమంత్రి ముందే రూ.లక్షన్నర కోట్లు వ్యయం అవుతుందని ఎలా చెప్పారని ప్రశ్నించారు. డీపీఆర్ సిద్ధం కాకముందే బుల్డోజర్లతో పేదల ఇళ్లను ఎందుకు కూల్చారన్నారు.
KTR | ఆ కంపెనీకి కట్టబెట్టే కుట్ర
మూసీ ప్రక్షాళన పేరిట భారీ దోపిడీ కోసం బ్లాక్‌లిస్టులో పెట్టిన మెయిన్ హార్ట్ అనే కంపెనీకి పనులు కట్టబెట్టే కుట్ర చేస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. రెడ్ కార్నర్ నోటీసులు (Red Corner Notices) జారీ అయిన కంపెనీకి కాంట్రాక్టు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. మూసీని కలుషితం చేసిందే 60 ఏళ్లపాటు పాలించిన కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాలన్నారు. గోదావరి నుంచి 20 టీఎంసీల నీటిని తరలిస్తామని చెబుతున్న ముఖ్యమంత్రి ముందుగా అవి కాళేశ్వరం నీళ్లా కాదా చెప్పాలన్నారు.
KTR | కమీషన్ల కోసం..
బీఆర్ఎస్ హయాంలో తక్కువ ఖర్చుతో మూసీ పునరుజ్జీవం కోసం గ్లోబల్ టెండర్లు పిలిచినట్లు కేటీఆర్ గుర్తు చేశారు. ఆసక్తి చూపిన 9 కంపెనీలు అన్ని రకాల డిజైన్లు సిద్ధం చేశాయన్నారు. వడ్డించిన విస్తరి లాంటి ప్రాజెక్టును పక్కన పెట్టి మళ్లీ కమీషన్ల కోసం కొత్త నాటకానికి తెరలేపారని ఆరోపించారు. దాదాపు రూ.16 వేల కోట్లతో మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తే, ఇప్పుడు రేవంత్ రెడ్డి ఆ అంచనాలను రూ.లక్షన్నర కోట్లకు పెంచి అతిపెద్ద కుంభకోణానికి తెరతీశారని ఆరోపించారు.