అక్షరటుడే, వెబ్‌డెస్క్ : CM Revanth Reddy | సీఎం రేవంత్‌రెడ్డి బీఆర్ఎస్పై మరోసారి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ (KCR) హయాంలో నీళ్లను తాకట్టు పెట్టి తమపై నిందలు వేస్తున్నారని మండిపడ్డారు.
అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా శనివారం నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి (Minister Uttam Kumar Reddy) పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. అనంతరం సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) మాట్లాడారు. బట్టలూడదీస్తాం, తోలు తీస్తాం అని మాట్లాడిన వాళ్లు ఇవాళ చర్చలో పాల్గొని ఉంటే ఎవరి బట్టలూడదీయాలో, ఎవరి తోలు తీయాలో తెలంగాణ ప్రజలు నిర్ణయించే వాళ్లు అన్నారు. ఇరిగేషన్ విషయంలో వాస్తవాలను సభ ద్వారా మంత్రి ఉత్తమ్ ప్రజలకు వివరించారన్నారు.
CM Revanth Reddy | మరణ శాసనం రాశారు
తెలంగాణ ఏర్పాటు అనంతరం 21 సెప్టెంబర్ 2016 లో జరిగిన మొదటి అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో రాష్ట్రానికి 299 టీఎంసీల నీళ్లు చాలు అని కేసీఆర్ సంతకం చేశారని రేవంత్‌రెడ్డి అన్నారు. అలా సంతకం చేసి తెలంగాణకు మొదటి మరణ శాసనం రాశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు నిజాలు బయటకు రావడంతో బహిరంగ సభల పేరుతో డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు. బండారం బయటపడుతుందని అబద్ధపు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. గోదావరిలో వృథా జలాల వినియోగంపై కేసీఆర్ ఏపీ ప్రభుత్వానికి సలహా ఇచ్చారన్నారు. దీంతో 2016లో బనకచర్లకు పునాది పడిందని చెప్పారు.
CM Revanth Reddy | పాలమూరుకు అన్యాయం
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌తో పాటు ప్రత్యేక రాష్ట్రంలోనూ పదేళ్లలో ఉమ్మడి పాలమూరు జిల్లాకు తీవ్ర అన్యాయం జరిగిందని సీఎం అన్నారు. తెలంగాణ వచ్చాక 2014 నుంచి 2023 వరకు ఏపీ ప్రతిరోజు 13.17 టీఎంసీల నీటిని అక్రమంగా వాడుకుందన్నారు. పోతిరెడ్డిపాడు, తెలుగుగంగ, ముచ్చుమర్రి, GNSS, రాయలసీమ, HNSS, వెలిగొండ ద్వారా నీళ్లను తరలించుకున్నారని వెల్లడించారు. మన తెలంగాణకు కేసీఆర్, హరీష్ రావులు ఇచ్చిన బహుమతి ఇది అని ఎద్దేవా చేశారు. పాలమూరుకు అన్యాయం చేసి ఆంధ్రకు మేలు చేసేలా వారు నిర్ణయం తీసుకున్నారని ఆరోపించారు.
నీళ్ల కోసం ప్రాణాలైనా ఇస్తానన్న కేసీఆర్ కృష్ణా నీటిని ఏపీకి ఎందుకు తాకట్టు పెట్టారని రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. ప్రతిపక్ష నేత కేసీఆర్ రెండేళ్లుగా అసెంబ్లీకి రాకపోవడం విచారకరమన్నారు. ప్రభుత్వం తోలు తీస్తామన్న కేసీఆర్ సభకు రాకుండా ఎక్కడికి పోయారని ప్రశ్నించారు.