అక్షరటుడే, హైదరాబాద్: Hyderabad | హైదరాబాద్ మహా నగరంలో భారీ వర్షాలు కురిసినా తట్టుకునేందుకు వీలుగా వ్యవస్థలన్నింటినీ ప్రక్షాళన చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Chief Minister Revanth Reddy) ఆదేశించారు.
వరద నీటి ప్రవాహనికి ఉన్న అడ్డంకులను అధిగమించటంతో పాటు భవిష్యత్తు తరాలకు ఉపయోగపడే అభివృద్ధికి వీలుగా పనులు చేపట్టాలని సూచించారు.
Hyderabad | మరో వందేళ్ల అవసరాలకు అనుగుణంగా..
వర్షాలతో మహానగరం అతలాకుతలం కాకుండా, జనజీవనం అస్తవ్యస్తం కాకుండా ఉండాలంటే.. అత్యవసరంగానే శాశ్వత అభివృద్ధి పనులు చేపట్టాల్సిన అవసరముందని సీఎం అన్నారు. వరద, తాగునీరు, డ్రైనేజీలు, ట్రాఫిక్ వ్యవస్థలను మరో వందేళ్ల భవిష్యత్తు అవసరాలను అంచనా వేసుకొని కొత్త ప్రణాళిక సిద్ధం చేయాలని ఆదేశించారు.
హైదరాబాద్(Hyderabad)లో ఇటీవలి వర్షాలు, తలెత్తిన ఇబ్బందులు, అధిగమించేందుకు అనుసరించాల్సిన తక్షణ చర్యలపై అధికారులతో అత్యవసర సమావేశంలో సమీక్షించారు.
నగరంలో నిన్న రాత్రి అత్యధికంగా 15 సెంటీమీటర్ల వర్షం కురవగా.. ట్రాఫిక్ స్తంభించటంతో పాటు లోతట్టు ప్రాంతాల్లో వరదతో ముంపు పరిస్థితులు ఉత్పన్నమయ్యాయి.
తక్కువ వ్యవధిలో ఎక్కువ వర్షం పడటంతో జనజీవనం అస్తవ్యస్తమవుతోంది. సాధారణంగా మూడు, నాలుగు నెలల్లో కురవాల్సిన వర్షం మొత్తం ఒకే రోజున కుమ్మరించటంతో నగరం అతలాకుతలమవుతోందని సమావేశంలో చర్చకు వచ్చింది.
వాతావరణ మార్పులే అందుకు ప్రధాన కారణమని, అందుకు తగినట్లుగా నగరంలో అన్ని వ్యవస్థలను ఆధునికీకరించాల్సిన అవసరముందని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా అధికారులకు సూచించారు.
హైదరాబాద్‌లో ఇప్పుడున్న రోడ్లు, డ్రైనేజీలు 5 సెంటీమీటర్ల వర్షం పడితే తట్టుకునే పరిస్థితి లేదు. ఒక్కోసారి 20 సెంటీమీటర్ల వర్షం నమోదవుతోంది. జూన్ నుంచి ఇప్పటివరకు జీహెచ్ఎంసీ పరిధిలో సాధారణంతో పోలిస్తే 16 శాతం వర్షపాతం ఎక్కువగా నమోదైంది.
అందుకే వాతావరణ మార్పులు, భారీ వర్షాలతో తలెత్తే ఈ విపత్కర పరిస్థితులను అధిగమించేందుకు విపత్తుల నివారణ నిర్వహణ ప్రణాళిక సమర్థవంతంగా అనుసరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
Hyderabad | తెరపైకి మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టు..
ఎంత వర్షం పడినా గ్రేటర్ హైదరాబాద్ సిటీలో వర్షపు నీటి నిల్వ ఉండకుండా, వరద నీటితో ముంపు గురవకుండా, లోతట్టు ప్రాంతాల ప్రజలు కూడా సురక్షితంగా ఉండేలా అత్యంత పకడ్బందీ విధానాన్ని అమలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందుకు వీలుగా రూపొందిస్తున్న మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టు (Musi Revival Project)ను వెంటనే చేపట్టాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి పేర్కొన్నారు.
హైదరాబాద్‌లో 55 కిలోమీటర్ల పొడవు మేర మూసీని పునరుద్ధరించటం ద్వారా పరీవాహక ప్రాంతంతో పాటు నగరంలో ఉన్న అన్ని ప్రాంతాలు, కాలనీలన్నీ సురక్షితంగా ఉండటంతో పాటు లోతట్టు ప్రాంతాలు వరద ముంపునకు గురి కాకుండా ఉంటాయని సీఎం రేవంత్ చెప్పుకొచ్చారు.
ఔటర్ రింగ్ రోడ్డు (Outer Ring Road) లోపల ఉన్న కోర్ అర్బన్ రీజియన్‌లోని వరదనీటి సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా నగరంలోని అన్ని వైపుల నుంచి వరద నీరు మూసీకి చేరేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని సీఎం సూచించారు.
మహానగరంలో ఉన్న హుస్సేన్‌సాగర్, దుర్గం చెరువు, మీర్ అలం చెరువులతో పాటు ప్రతి చెరువు, కుంటలను నాలాల ద్వారా మూసీకి అనుసంధానం చేయాల్సి ఉంది. చెరువుల పునరుద్ధరణ, నాలాలను వెడల్పు ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని సీఎం చెప్పారు.
కలుషితమైన నీటితో మూసీ పరివాహక ప్రాంతంలో రైతులు పంటలు పండిస్తున్నారని, ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్నారని, ఇకపై అలాంటి పరిస్థితి తలెత్తకుండా మూసీలో నిరంతరం శుద్ధి చేసిన నీటి ప్రవాహం ఉండేలా శాశ్వత ప్రణాళికలు ఉండాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు.
భవిష్యత్తులో వందేళ్ల పాటు మహానగరంలో వరద నీటి సమస్య పునరావృతం కాకుండా ఉండాలంటే మూసీ పునరుజ్జీవనం అవసరమని సీఎం తెలిపారు. మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టును వరద నీటి నిర్వహణకు వీలుగా డిజైన్ చేసి ఆ దిశగా పనులు చేపట్టాలన్నారు.
హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. వర్షాలు, వరదల సమయంలో ట్రాఫిక్ సమస్య తీవ్రత మరింత పెరుగుతుండటంతో శాశ్వత పరిష్కారం చూపేలా చర్యలు తీసుకోవాలన్నారు.
ముఖ్యంగా పాతనగరంలో ఈ సమస్యను పరిష్కరించేందుకు పెడిస్ట్రియల్ జోన్‌ను ఏర్పాటు చేసి పార్కింగ్ సమస్యకు చెక్ పెట్టాలని సీఎం సూచించారు. చార్మినార్, సాలార్ జంగ్ మ్యూజియం, హైకోర్టు, ఉస్మానియా ఆసుపత్రి ప్రాంతాల్లో మల్టీ లెవెల్ పార్కింగ్ జోన్‌లను ఏర్పాటు చేసేందుకు కార్యాచరణ సిద్ధం చేయాలని ఆదేశించారు.
ఈ సమావేశంలో సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డితో పాటు మున్సిపల్ వ్యవహారాలు, పట్టణాభివృద్ధి శాఖ ఉన్నతాధికారులు, హెచ్ఎండీఏ, ఎంఆర్డీసీఎల్ ఉన్నతాధికారులు, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ తదితరులు పాల్గొన్నారు.
