అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Former DSP Nalini | మాజీ డీఎస్పీ నళినికి అండగా నిలువనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. అన్ని విధాలుగా ఆదుకుంటామని ప్రకటించింది. తన ఆరోగ్య పరిస్థితిని వివరిస్తూ మాజీ డీఎస్పీ ఆదివారం సోషల్ మీడియాలో పోస్టు చేసిన నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) స్పందించారు. యాదాద్రి భువనగిరి (Bhuvanagiri) జిల్లా కలెక్టర్ హనుమంతరావు (Collector Hanumantha Rao)ను ఆమె ఇంటికి పంపించి వివరాలు ఆరా తీశారు. ఆమెకు ప్రభుత్వం తరఫున అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
Former DSP Nalini | ఆవేదనతో బహిరంగ లేఖ
నల్గొండ (Nalgonda) జిల్లాకు చెందిన డీఎస్పీ నళిన తెలంగాణ ఉద్యమంలో భాగంగా అప్పట్లో తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. ప్రత్యేక రాష్ట్రం సిద్ధించినప్పటికీ ఆమెకు తగిన న్యాయం జరగలేదు. ప్రస్తుతం తీవ్ర అనారోగ్యంతో బాధ పడుతున్న ఆమె తన పరిస్థితిని వివరిస్తూ సోషల్ మీడియాలో పోస్టు చేసింది. గత, ప్రస్తుత ప్రభుత్వాలు తనను పట్టించుకోలేదని, చావు అంచుకు చేరిన తనకు సరైన న్యాయం చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక తన ఫైల్ తెరిచారని, తనకేదో సాయం చేస్తానని ప్రకటించారన్నారు. సీఎంను కలిసి తన మనసులో మాట చెప్పానని, సస్పెన్షన్‌పై విచారణ చేయించి ఇన్నెండ్లు ఇవ్వకుండా ఎగ్గొట్టిన సబ్సిస్టెన్స్ అలవెన్స్ లెక్క కట్టి రూ.2 కోట్లు ఇవ్వండి అని అడుగుతూ 16 పేజీల స్వీయ లిఖిత రిపోర్ట్‌ను ఇచ్చినా ఇప్పటికీ స్పందన లేదన్నారు. ప్రస్తుతం తాను చావు అంచుల్లో ఉన్నానని, సరైన చికిత్స లభించకపోతే చనిపోవడం ఖాయమని వాపోయారు.
Former DSP Nalini | స్పందించిన ముఖ్యమంత్రి
మాజీ డీఎస్పీ నళిని ఆవేదనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. కలెక్టర్ హనుమంతరావును ఆమె ఇంటికి పంపించి వివరాలు ఆరా తీశారు. సోమవారం నళినిని కలిసిన కలెక్టర్ వివరాలు సేకరించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఆమె ప్రస్తుతం ఆయుర్వేద మందులు వాడుతున్నారని, ఇప్పుడిప్పుడే ఆరోగ్యం మెరుగు పడుతుందని తెలిపారు. నళిని ఆరోగ్య పరిస్థితులు,ఆమె ఆవేదనను తెలుసుకోవాలని తనను సీఎం ఆదేశించారనన్నారు. నళినికి ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం చెప్పారని తెలిపారు. ఆమె వైద్య ఖర్చులు, అంతకు ముందు అయిన ఖర్చులను కూడా ప్రభుత్వం భరిస్తుందన్నారు. నళినికి రావాల్సిన బెన్ ఫిట్స్ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి న్యాయం జరిగేలా చూస్తామని తెలిపారు.