అక్షరటుడే, వెబ్డెస్క్ : CM Revanth Reddy | మొంథా తుపాన్ (Cyclone Montha) ప్రభావంతో పలు జిల్లాల్లో కుండపోత వర్షాలు (Heavy Rains) కురిశాయి. దీంతో చేతికొచ్చిన పంట నీట మునిగింది. లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగింది. ఉమ్మడి వరంగల్ (Warangal Floods) జిల్లాల్లో వరద ఉధృతికి పలు ఇళ్లు నీట మునిగాయి. సీఎం రేవంత్రెడ్డి వరద బాధితులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు.
వరద ప్రభావిత ప్రాంతాలను సీఎం శుక్రవారం ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించారు. హన్మకొండలో నీట మునిగిన పలు కాలనీలను పరిశీలించారు. వరద బాధితులతో మాట్లాడారు. అనంతరం కలెక్టరేట్లో అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తుపాను ప్రభావంతో 12 జిల్లాల్లో తీవ్ర నష్టం వాటిల్లిందని చెప్పారు. పంట నష్టం, ఆస్తి నష్టం, దెబ్బతిన్న రోడ్లపై నివేదికలు తెప్పించాలని ఆదేశించారు. వరద నష్టంపై కేంద్రం నుంచి నిధులు రాబట్టుకోవాలన్నారు. ఈ మేరకు నిర్ణిత విధానంలో కేంద్రానికి నష్టంపై ప్రతిపాదనలు పంపాలని ఆదేశించారు.
CM Revanth Reddy | వారికి రూ.5 లక్షల పరిహారం
వరదల్లో మృతి చెందిన వారి కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం (Compensation) ఇస్తామని సీఎం తెలిపారు. ఇళ్లు మునిగిన వారికి రూ.15వేల చొప్పున, పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.10 వేలు అందిస్తామని ప్రకటించారు. గుడిసెలు కోల్పోయిన వారికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని అధికారులను ఆదేశించారు. వరదల్లో ఆవులు, గేదెలు చనిపోతే రూ.50వేలు, మేకలు, గొర్రెలకు రూ.5వేల చొప్పున ఎక్స్గ్రేషియా చెల్లించాలన్నారు.
CM Revanth Reddy | ఆక్రమణలు తొలగించాలి
వరంగల్, హన్మకొండలో రోడ్లు, కాలనీల్లో పేరుకుపోయిన చెత్తను తొలగించాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఓరుగల్లును త్వరగా పునరుద్దరించాలని సూచించారు. నాలాలపై అక్రమ నిర్మాణాలు వెంటనే తొలగించాలన్నారు.

