అక్షరటుడే, వెబ్‌డెస్క్ : CM Revanth Reddy | హైదరాబాద్ (Hyderabad) నగరంలో భారీ వర్షాలతో వరద ముంపునకు గురువుతున్న ప్రాంతాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివారం పరిశీలించారు. ఆయా ప్రాంతాల్లో శాశ్వత పరిష్కార చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అమీర్‌పేట్ (Ameerpet) బుద్ధనగర్, మైత్రివనం, బాల్కంపేట తదితర ప్రాంతాల్లో వరద ముంపుతో ప్రభావిత కాలనీలను ముఖ్యమంత్రి పరిశీలించారు.
బాల్కంపేట ముంపు ప్రభావిత ప్రాంతంలో తలెత్తుతున్న సమస్యలపై హైడ్రా కమిషనర్ (Hydraa Commissioner) రంగనాథ్, ఇతర అధికారులను ఆరా తీశారు. బుద్ధనగర్ ప్రాంతంలో కాలనీ రోడ్డు కంటే డ్రెయినేజీ కాలువ ఎక్కువ ఎత్తులో ఉండటంతో ఇరుకుగా మారి వరద తీవ్రత పెరుగుతోందని గమనించిన ముఖ్యమంత్రి వెంటనే చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
CM Revanth Reddy | కుంట పూడ్చారని ఫిర్యాదు
బుద్ధనగర్ పక్కనే గంగూబాయి బస్తీకుంటను సీఎం సందర్శించారు. బస్తీకుంటను కొంతమంది పూడ్చేసి పార్కింగ్ కోసం వినియోగిస్తున్నారని స్థానికులు ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేశారు.ఆ ప్రాంతంలో ప్రత్యేక ట్రంక్ లైన్ ఏర్పాటు చేసి వరద సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని ఆయన ఆదేశించారు.
CM Revanth Reddy | పుస్తకాలు తడిసిపోయాయి
అమీర్‌పేట బుద్ధనగర్‌లో జశ్వంత్ అనే బాలుడితో ముఖ్యమంత్రి మాట్లాడారు. తాను ఏడో తరగతి చదువుతున్నట్లు బాలుడు చెప్పాడు. వరద నీరు ఇంట్లోకి రావడంతో తన పుస్తకాలు తడిసి పోయాయని బాలుడు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాడు. భవిష్యత్తులో వరద పరిస్థితులు తలెత్తకుండా శాశ్వత పరిష్కారం చూపిస్తానని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు.