BC Reservations
BC Reservations | బీసీ రిజర్వేషన్లపై నేడు సీఎం కీలక సమావేశం

అక్షరటుడే, వెబ్​డెస్క్ : BC Reservations | రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ల అంశం కొలిక్కి రావడం లేదు. దీంతో స్థానిక సంస్థల ఎన్నికల (Local Body Elections) ప్రక్రియ ఆలస్యం అవుతోంది.

తాము అధికారంలోకి వస్తే విద్య, ఉద్యోగాలు, స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని కాంగ్రెస్​ హామీ ఇచ్చింది. ఈ మేరకు అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు బిల్లులను ఆమోదించి కేంద్రానికి పంపింది. వాటిని రాష్ట్రపతి పెండింగ్​లో పెట్టారు. దీంతో స్థానిక ఎన్నికల్లో మాత్రమే రిజర్వేషన్లు అమలు చేసేలా మరో బిల్లు ఆమోదించి గవర్నర్​ ఆమోదం కోసం పంపించగా ఆయన పెండింగ్​లో పెట్టారు.

BC Reservations | మంత్రులతో భేటీ

బీసీ రిజర్వేషన్ల అంశం తేలితే గానీ స్థానిక ఎన్నికలు నిర్వహించే అవకాశం లేదు. శుక్రవారం సీఎం రేవంత్​రెడ్డి (CM Revanth Reddy) ఢిల్లీలో మాట్లాడుతూ.. స్థానిక ఎన్నికలపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. తాజాగా బీసీ రిజర్వేషన్లపై చర్చించేందుకు ఆయన శనివారం సాయంత్రం సమావేశం నిర్వహించనున్నారు. మంత్రులు, ఉన్నతాధికారులు, న్యాయనిపుణులతో రిజర్వేషన్​ అంశంపై చర్చించనున్నారు. కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో సీఎం అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. ఈ నెలాఖరులోగా పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు (High Court) గతంలో ఆదేశించిన విషయం తెలిసిందే. గడువు సమీపిస్తుండటంతో సీఎం సమావేశం నిర్వహిస్తున్నారు. మరింత సమయం కావాలని ప్రభుత్వం హైకోర్టును కోరే అవకాశం ఉన్నట్లు సమాచారం.

BC Reservations | ప్రజల్లో ఆగ్రహం

స్థానిక సంస్థల ఎన్నికల కోసం గ్రామాల్లో నాయకులు, ప్రజలు ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నారు. పల్లెల్లో సర్పంచులు లేక ఏడాదిన్నర దాటిపోయింది. ఎంపీటీసీలు, జెడ్పీటీసీల పదవీకాలం పూర్తయి కూడా ఏడాది దాటింది. అయినా ఎన్నికలు మాత్రం నిర్వహించడం లేదు. దీంతో ఏదైనా సమస్య వస్తే గ్రామంలో ఎవరికి చెప్పుకోవాలో తెలియక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పంచాయతీ కార్యదర్శులను అడిగితే నిధులు లేవని చేతులు ఎత్తేస్తున్నారు. దీంతో త్వరగా ఎన్నికలు పెట్టాలని ప్రజలు కోరుతున్నారు.