అక్షరటుడే, వెబ్‌డెస్క్: CM Chandrababu | ఆంధ్రప్రదేశ్ శాసనసభ (AP Legislative Assembly) మంగళవారం అరుదైన క్షణానికి వేదికైంది. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Chandra babu naidu) చేసిన సరదా వ్యాఖ్యతో సభలో సభ్యులంతా నవ్వులతో ముంచెత్తారు. వైద్య ఆరోగ్య శాఖపై (medical and health department) జరుగుతున్న చర్చలో ఆయన చేసిన చమత్కారం అందరినీ ఆకట్టుకుంది.
ప్రజల ఆహారపు అలవాట్లపై వ్యాఖ్యానించిన సీఎం చంద్రబాబు, “మనిషి ఆయుర్దాయం 120 ఏళ్లు. కానీ మనం 40 ఏళ్లకే 120 ఏళ్లకు సరిపడా తింటున్నాం” అంటూ మాట్లాడారు. ఈ క్రమంలో ఆయన డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు (Deputy Speaker Raghurama Krishna Raju) వైపు చూశారు. నవ్వుతూ, “అధ్యక్షా, ఇది మీకు కూడా వర్తిస్తుంది!” అని అనడంతో సభ ఒక్కసారిగా నవ్వులతో నిండిపోయింది. డిప్యూటీ స్పీకర్ కూడా తన నవ్వు ఆపుకోలేకపోయారు.
CM Chandrababu | నవ్వులే నవ్వులు..
చంద్రబాబు పలు ఆసక్తికర విశేషాలు కూడా పంచుకున్నారు. “గతంలో కొందరు పోలీసుల పొట్టలు పెరిగినప్పుడు, వారిని తగ్గించుకోవాలని చెప్పాను. నా డాక్టర్లు కూడా ఇలానే ఉన్నప్పుడు, ‘డాక్టర్లే పేషెంట్లయితే ఎలా?’ అని చెబుతుంటాను. ముందు నీకు నీవే ట్రీట్‌మెంట్ ఇచ్చుకో” అని వారితో చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ సరదా సంభాషణ అనంతరం సీఎం ఆరోగ్య పరిరక్షణపై ముక్తకంఠంతో మాట్లాడారు. “ఆహారమే ఔషధం, మన వంటగదే ఓ ఫార్మసీ” అనే సూత్రాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని పిలుపునిచ్చారు. అనారోగ్యానికి అధికాహారం ప్రధాన కారణమని స్పష్టంచేశారు. తాను, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi) కూడా సెలవులు తీసుకోకపోవడానికి క్రమశిక్షణతో కూడిన జీవనశైలే కారణమని తెలిపారు.
ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఏంటంటే.. ప్రతి పౌరుడి ఆరోగ్య సమాచారాన్ని నమోదు చేసి, 41 రకాల వైద్య పరీక్షలు నిర్వహించి హెల్త్ రికార్డు (health record) సిద్ధం చేయడం, రాష్ట్రంలోని ప్రతి పౌరుడికి రూ. 2.5 లక్షల ఆరోగ్య బీమా కల్పన, ఉప్పు, పంచదార, నూనె వాడకాన్ని తగ్గించాలని సూచన, రోజుకు కనీసం 8 గంటల నిద్ర అవసరం అని సూచన చేయడడం. ఇక ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్స ఖర్చుల కన్నా గదుల అద్దెలే భారంగా మారిన పరిస్థితిపై చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తూ ముందడుగు వేస్తోందని ముఖ్యమంత్రి తెలిపారు.