అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Cloud Burst | క్లౌడ్ బరస్ట్ తో జమ్మూకశ్మీర్ (Jammu Kashmir) మరోసారి వణికి పోయింది. దోడా జిల్లాలో మంగళవారం కురిసిన భారీ వర్షాలకు ఆకస్మిక వరదలు సంభవించి నలుగురు మృతి చెందారు. పదికి పైగా ఇళ్లు దెబ్బతిన్నాయి.
జమ్మూలోని వివిధ ప్రాంతాలలో భారీ వర్షం (Heavy Rain) కారణంగా పరిస్థితి చాలా తీవ్రంగా ఉందని ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా (CM Omar Abdullah) ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. జమ్మూలో వరద నియంత్రణ చర్యలను సమీక్షించడానికి నిర్వహించిన సమావేశంలో ముఖ్యమంత్రి ఈ సూచనలు ఇచ్చారని సీఎంవో ‘X’లో తెలిపింది.
Cloud Burst | ఉధృతంగా ప్రవహిస్తున్న నదులు
జమ్మూ డివిజన్లో మూడు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలతో దాదాపు అన్ని నదులు, వాగులు ప్రమాద స్థాయిలో ప్రవహిస్తున్నాయి. అనేక ప్రాంతాలలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలు నిలిపివేశారు. వైష్ణో దేవి యాత్రను (Vaishno Devi Yatra) తాత్కాలికంగా రద్దు చేశారు.. “జమ్మూలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల దృష్ట్యా వరద నివారణ చర్యలను ముఖ్యమంత్రి సమీక్షించారు. అత్యంత అప్రమత్తంగా ఉండాలని, అన్ని సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు” అని ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది. మరోవైపు, జమ్మూలోని అనేక ప్రాంతాలలో పరిస్థితి చాలా తీవ్రంగా ఉందని అబ్దుల్లా ఒక ప్రత్యేక పోస్ట్‌లో తెలిపారు. పరిస్థితిని వ్యక్తిగతంగా పర్యవేక్షించడానికి శ్రీనగర్ నుంచి వెళ్తున్నట్లు పేర్కొన్నారు.
Cloud Burst | వైష్ణోదేవి యాత్ర నిలిపివేత..
భారీ వర్షాలు కురుస్తుండడంతో మాతా వైష్ణో దేవి పుణ్యక్షేత్రానికి యాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు. భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో హిమ్కోటి మార్గాన్ని(Himkoti Route) మూసివేశారు. వాతావరణం మెరుగుపడకపోవడంతో యాత్రను నిలిపివేయాలని శ్రీ మాతా వైష్ణో దేవి పుణ్యక్షేత్ర బోర్డు (SMVDSB) నిర్ణయించింది. భక్తుల భద్రత మా ప్రధానం. పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చిన తర్వాత యాత్ర తిరిగి ప్రారంభమవుతుంది” అని బోర్డు ప్రతినిధి ఒకరు తెలిపారు. పుకార్లను నమ్మవద్దని, పుణ్యక్షేత్ర బోర్డు అధికారిక మార్గాల ద్వారా జారీ చేయబడిన అప్ డేట్స్ ను కచ్చితంగా పాటించాలని కోరారు.
