
అక్షరటుడే, వెబ్‌డెస్క్: Malegaon Blasts | దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మాలేగావ్ పేలుళ్ల కేసులో ముంబైలోని ప్రత్యేక కోర్టు గురువారం తీర్పు వెలువరించింది. బీజేపీ మాజీ ఎంపీ ప్రజ్ఞాసింగ్ ఠాకూర్(Former BJP MP Pragya Singh Thakur), లెఫ్టినెంట్ కల్నల్ ప్రసాద్ పురోహిత్(Lieutenant Colonel Prasad Purohit) సహా ఏడుగురు నిందితులను NIA ప్రత్యేక కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది.
ఏ మతం కూడా ఉగ్రవాదాన్ని సమర్థించదని ఈ సందర్భంగా కోర్టు వ్యాఖ్యానించింది. నిందితులకు వ్యతిరేకంగా సాక్ష్యాలు సేకరించడంలో, నిరూపించడంలో ప్రాసిక్యూషన్ విఫలమైందని ప్రత్యేక న్యాయమూర్తి ఎ.కె.లహోటి(Special Judge A.K. Lahoti) పేర్కొన్నారు. మోటార్‌సైకిల్‌పై బాంబు అమర్చారని ప్రాసిక్యూషన్ నిర్ధారించడంలో విఫలమైందని తెలిపారు. ఆర్‌డీఎక్స్‌ను కశ్మీర్ నుంచి తీసుకువచ్చినట్లు ఎటువంటి కచ్చితమైన ఆధారాలు లేవని ఎత్తి చూపారు.
మోటార్‌సైకిల్‌ను (Motorcycle) ఎవరు పార్క్ చేశారో లేదా అది అక్కడికి ఎలా వచ్చిందో దర్యాప్తులో నిర్ధారించలేకపోయారని చెప్పారు. అదే సమయంలో ఘటనా సమయంలో వేలిముద్రల నమూనాలను సేకరించలేదని, ఇతర ఆధారాలను సేకరించడంలో విఫలమయ్యారని పేర్కొన్నారు. సాధ్వి ప్రజ్ఞ మోటార్‌సైకిల్ రిజిస్టర్డ్ యజమాని అయినప్పటికీ, పేలుడు సమయంలో అది ఆమె ఆధీనంలో ఉందని ఎటువంటి రుజువు లేదని పేర్కొన్నారు. దాదాపు 17 సంవత్సరాల సుదీర్ఘ విచారణ తర్వాత మాలేగావ్ పేలుళ్ల (Malegaon Blasts) కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న మాజీ బీజేపీ ఎంపీ ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ సహా ఏడుగురు నిందితులను న్యాయస్థానం నిర్దోషులుగా ప్రకటించింది.
Malegaon Blasts | సంచలనం రేపిన పేలుళ్లు
మహారాష్ట్రలోని అత్యంత సున్నిత ప్రాంతమైన మాలేగావ్‌లో 2008లో జరిగిన పేలుళ్లలో ఆరుగురు మరణించగా, 100 మందికి పైగా గాయపడ్డారు. సరిగ్గా రంజాన్ మాసంలో మసీదుకు సమీపంలో మోటార్ బైక్‌పై ఆర్‌డీఎక్స్(RDX) ఉంచి పేల్చారు. ఈ ఘటన అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (Anti Terrorist Squad) పలువురు సాక్షులను విచారించింది. కొద్దిరోజుల తర్వాత కేసును జాతీయ దర్యాప్తు బృందానికి అప్పగించారు.
పేలుళ్లకు కుట్ర పన్నారని బీజేపీ మాజీ ఎంపీ ప్రజ్ఞా ఠాకూర్, లెఫ్టినెంట్ కల్నల్ పురోహిత్, మేజర్ (రిటైర్డ్) రమేశ్ ఉపాధ్యాయ్, అజయ్ రహిర్కర్, సుధాకర్ ద్వివేది, సుధాకర్ చతుర్వేది, సమీర్ కులకర్ణి నిందితులుగా పేర్కొన్నారు. వారిపై చట్టవిరుద్ధ కార్యకలాపాల (నివారణ) చట్టం (UAPA) భారత శిక్షాస్మృతి కింద పలు అభియోగాలు నమోదు చేశారు. వాటన్నింటినీ ప్రత్యేక న్యాయస్థానం తోసిపుచ్చింది. పేలుళ్లకు నిందితులు కుట్ర పన్నినట్లు ప్రాసిక్యూషన్ నిరూపించలేకపోయిందని తెలిపింది. ఈ కేసులో చట్టవిరుద్ధ కార్యకలాపాల (నివారణ) చట్టం (యూఏపీఏ)ను అమలు చేయడానికి ఇచ్చిన అనుమతి లోపభూయిష్టంగా ఉందని పేర్కొంది. సాక్షుల వాంగ్మూలాలు ఒకదానికొకటి విరుద్ధంగా ఉన్నాయని, స్పష్టత లేదని తెలిపింది.