అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Cheque Power | రాష్ట్రంలో ఉప సర్పంచ్ (Upa Sarpanch) చెక్ పవర్ రద్దు అయినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. దీనిపై తాజాగా ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. చెక్ పవర్ రద్దు చేయలేదని తెలిపింది.
రాష్ట్రంలో ఇటీవల మూడు దశల్లో పంచాయతీ ఎన్నికలు (Panchayat elections) జరిగాయి. కొత్త పాలకవర్గాలు కొలువుదీరాయి. గతంలో సర్పంచ్‌తో పాటు ఉప సర్పంచ్‌కు చెక్ పవర్ ఉండేది. దీంతో ఉప సర్పంచ్ పదవికి తీవ్ర పోటీ నెలకొంది. దీంతో పలు గ్రామాల్లో వార్డు సభ్యులకు డబ్బులు ఇచ్చి మరి పలువురు ఉప సర్పంచ్ పదవి పొందారు.
Cheque Power | సోషల్ మీడియాలో వైరల్
ఉప సర్పంచ్‌కు చెక్ పవర్ రద్దు అయిందంటూ మంగళవారం ఉదయం నుంచి వార్తలు వచ్చాయి. సోషల్ మీడియా (Social Medai)లో ఈ వార్త వైరల్‌గా మారింది. దీంతో ఉప సర్పంచ్‌లుగా ఎన్నికైన వారు ఆందోళన చెందారు. ఈ క్రమంలో తాజాగా ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. ఉప సర్పంచ్‌లకు చెక్ పవర్ రద్దు చేయలేదని స్పష్టం చేసింది. ఈ మేరకు అధికారవర్గాలు క్లారిటీ ఇచ్చాయి. దీంతో ఉప సర్పంచ్‌లు ఊపిరి పీల్చుకున్నారు.
Cheque Power | జాయింట్ చెక్‌పవర్..
సర్పంచ్ ఒక్కరి దగ్గర చెక్ పవర్ ఉంటే నిధులు దుర్వినియోగం అయ్యే అవకాశం ఉందని గత ప్రభుత్వ హయాంలో ఉప సర్పంచ్‌కు చెక్ పవర్ కల్పించారు. 2018 పంచాయతీరాజ్ చట్టం (Panchayati Raj Act) ప్రకారం గ్రామాల్లో ఉప సర్పంచ్‌కు జాయింట్ చెక్ పవర్ ఇవ్వడంతో ఆ పదవి కీలకంగా మారింది. కాగా ప్రభుత్వం 15వ ఆర్థిక సంఘం నిధుల కోసం ప్రత్యేక అకౌంట్ ఓపెన్ చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. జీపీ కార్యదర్శి, ఎంపీడీవో, సర్పంచ్, ఎంపీపీ డిజిటల్ సంతకాలతో పేమెంట్లు జరుగుతాయని పేర్కొంది. అయితే దీనిని షేర్ చేస్తూ కొందరు ఉప సర్పంచ్‌కు చెక్ పవర్ రద్దు అయింది అంటూ ప్రచారం చేశారు.