అక్షరటుడే, హైదరాబాద్: Hydraa : ఒవైసీ ఫాతిమా కాలేజీ(Owaisi Fatima College)పై ఎట్టకేలకు హైడ్రా కమిషనర్ రంగనాథ్(Hydraa Commissioner Ranganath) వివరణ ఇచ్చారు. ‘ఆ కాలేజీని ఎందుకు కూల్చలేదని అందరూ అడుగుతున్నారు.. FTLలో కాలేజీ నిర్మించినందుకు గత సెప్టెంబరులో తొలగిస్తాం’ అని చెప్పినట్లు గుర్తుచేశారు.
కానీ, పేద ముస్లిం అమ్మాయిల కోసం కేజీ నుంచి పీజీ వరకు ఈ సంస్థ నడుస్తోందని కమిషనర్ తెలిపారు. ఈ కాలేజీలో ఎలాంటి ఫీజులు వసూలు చేయరని చెప్పారు. అందులో 10 వేల మందికి పైగా విద్యను అభ్యసిస్తున్నారని వెల్లడించారు.
పేదల కోసం పనిచేస్తున్న కాలేజీ కాబట్టి, సామాజిక కోణంలో ఆలోచించి చర్యలు తీసుకోలేకపోతున్నామని వివరణ ఇచ్చారు. కానీ, ఎంఐఎం నాయకుల ఆస్తుల వ్యవహారంలో కఠినంగానే వ్యవహరిస్తున్నామని కమిషనర్ స్పష్టం చేశారు.
Hydraa : ఎంఐఎం నాయకుల విషయంలో..
ఎంఐఎం నాయకుల ఆస్తుల వ్యవహారంలో కఠినంగా వ్యవహరిస్తున్నట్లు హైడ్రా కమిషనర్ స్పష్టం చేశారు. ఎంఐఎం ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు కబ్జా చేసిన భారీ నిర్మాణాలను నేలమట్టం చేసినట్లు పేర్కొన్నారు. 25 ఎకరాల సరస్సును చదును చేసిన ఓవైసీ కుటుంబానికి అత్యంత సన్నిహితుడి కట్టడాలను సైతం నేలమట్టం చేసినట్లు వివరించారు.
Hydraa : రూ. 1,000 కోట్ల ఆస్తి రికవరీ..
ఎంఐఎం MIM నాయకుల నుంచి దాదాపు రూ. వెయ్యి కోట్ల ఆస్తులను ఇప్పటికే రికవరీ చేసుకున్నట్లు కమిషనర్ చెప్పుకొచ్చారు. చాంద్రయాన్గుట్టలో ఎంఐఎం కార్పొరేటర్ కబ్జా చేసిన స్థలాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. కానీ, ఫాతిమా కాలేజీ కూల్చివేతను సామాజిక కారణాల వల్లనే నిలిపివేసినట్లు వెల్లడించారు.
Hydraa : కౌంటర్ ప్రశ్నలు సంధించిన బండి సంజయ్
కాగా, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్(Union Minister of State for Home Affairs Bandi Sanjay) కౌంటర్ ప్రశ్నలు సంధించారు. ఫాతిమా ఓవైసీ కళాశాల జోలికి వెళ్లబోమని హైడ్రా కమిషనర్ ’ఎక్స్’లో పోస్ట్ చేసిన విషయాన్ని ప్రస్తావించారు. ఆ ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ (MIM MLA Akbaruddin) కాలేజీ జోలికి వెళ్తే.. ఏం అన్యాయం జరుగుతుందో సీఎం రేవంత్ రెడ్డి తెలపాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు.
Hydraa : మూసీ వాసులు పేదవారు కాదా..?
కమిషనర్ చెప్పింది ప్రభుత్వ నిర్ణయమా..? లేక కమిషనర్ సొంత నిర్ణయమా చెప్పాలని ప్రశ్నించారు. మూసీ పరీవాహక ప్రాంతంలో హైడ్రా చర్యలను ఈ సందర్భంగా ప్రస్తావించారు. అక్కడి పేదల గుడిసెలను హైడ్రా అధికారులు కూల్చిన విషయాన్ని గుర్తుచేశారు.
ఇలా పేదల గుడిసెలు కూల్చి, వారికి నీడ లేకుండా చేసిన హైడ్రా అధికారులు.. అక్బరుద్దీన్ ఓవైసీ కళాశాలకు మాత్రం నోటీసులిచ్చి ఎందుకు వదిలేశారని ప్రశ్నించారు. మరి, ఆ కళాశాలను మరోచోటుకు తరలించాలని ఎందుకు చెప్పలేదని బండి సంజయ్ నిలదీశారు. ఈ విషయంలో స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.
చాంద్రయాన్ గుట్ట పరిధిలోని ఫాతిమా ఓవైసీ కళాశాలను సాలార్ ఈ మిల్లత్ ఎడ్యుకేషనల్ సొసైటీ నడుపుతోంది. కాగా, ఈ కళాశాలను సల్కం చెరువు పరిధిలో నిర్మించారు. ఈ నేపథ్యంలోనే ఈ కాలేజీ యాజమాన్యానికి హైడ్రా నోటీసులు జారీ చేసింది.