అక్షరటుడే, వెబ్‌డెస్క్: CJI Gavai | పదవీ విరమణ తర్వాత ఎలాంటి ప్రభుత్వ పదవులు చేపట్టనని భారత ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయ్ వెల్లడించారు. సీజేఐగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా తన స్వగ్రామానికి వచ్చిన ఆయన ఈ సందర్భంగా తన రిటైర్‌మెంట్ ప్రణాళికలు వెల్లడించారు. పదవీ విరమణ తర్వాత తాను ఏ ప్రభుత్వ పదవిని లేదా ప్రయోజనాల పాత్రను అంగీకరించబోనని ప్రకటించారు. పదవీ విరమణ తర్వాత ఎక్కువ భాగం దారాపూర్, అమరావతి, నాగ్‌పూర్‌లలో గడపాలని అనుకుంటున్నట్లు వివరించారు.
CJI Gavai | పాత ఇంటిని చూసి భావోద్వేగం..
భారత చీఫ్ జస్టిస్‌గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం తొలిసారి స్వగ్రామానికి వచ్చిన గవాయ్‌కు స్థానికులు ఘన స్వాగతం పలికారు. సొంతూరుకు వచ్చిన ఆయన తన బాల్య జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. తన పాత ఇంటిని సందర్శించి భావోద్వేగానికి గురయ్యారు. ఈ సందర్భంగా రిటైర్‌మెంట్ తర్వాత తన శేష జీవితాన్ని ఇదే ప్రాంతంలో గడుపుతానని గవాయ్ వెల్లడించారు. “నా పదవీ విరమణ తర్వాత నేను ఏ ప్రభుత్వ పదవిని అంగీకరించకూడదని నిర్ణయించుకున్నాను. రిటైర్‌మెంట్ తర్వాత నాకు ఎక్కువ సమయం లభిస్తుంది. కాబట్టి నేను దారాపూర్, అమరావతి, నాగ్‌పూర్‌లలో ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నిస్తాను” అని ఆయన తెలిపారు.
CJI Gavai | న్యాయవ్యవస్థపై నమ్మకం పెంచేలా..
గతంలో పదవీ విరమణ తర్వాత కొందరు న్యాయమూర్తులు రాజకీయ పదవులు చేపట్టారు. రిటైర్‌మెంట్ తర్వాత మాజీ CJI రంజన్ గొగోయ్ రాజ్యసభ సభ్యుడయ్యారు. కలకత్తా హైకోర్టు మాజీ న్యాయమూర్తి అభిజిత్ గంగోపాధ్యాయ రాజీనామా చేసి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడానికి బీజేపీలో చేరారు. ఆయా అనుభవాల రీత్యా ప్రస్తుత సీజేఐ తాను ఎలాంటి పదవి చేపట్టోనని చెప్పారు. రిటైర్‌మెంట్ తర్వాత ఏ పదవీ చేపట్టకూడదని సీజేఐ గవాయ్ గతంలోనే పేర్కొన్నారు.
UK సుప్రీంకోర్టులో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, పదవీ విరమణ తర్వాత ఏ ప్రభుత్వ పదవిని అంగీకరించకుండా న్యాయ వ్యవస్థపై ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని తనతో పాటు సుప్రీంకోర్టులోని తన సహచరులు కూడా ప్రతిజ్ఞ చేశారని చెప్పారు.
“ఒక న్యాయమూర్తి పదవీ విరమణ తర్వాత వెంటనే ప్రభుత్వంలో మరో బాధ్యత చేపడితే లేదా ఎన్నికలలో పోటీ చేయడానికి బెంచ్ నుంచి రాజీనామా చేస్తే, అది గణనీయమైన నైతిక ఆందోళనలను లేవనెత్తుతుంది. అది ప్రజల్లో చర్చకు తావిస్తుంది. పదవీ విరమణ తర్వాత ఇతర విధులు నిర్వహిస్తే అది న్యాయవ్యవస్థ సమగ్రతపై ప్రజలకు ఉన్న నమ్మకాన్ని దెబ్బతీస్తుంది. ప్రభుత్వ నియామకాలు లేదా రాజకీయ ప్రమేయం ద్వారా న్యాయ నిర్ణయాలు ప్రభావితమవుతాయనే అభిప్రాయాన్ని సృష్టించవచ్చు” అని గవాయ్ పేర్కొన్నారు.