అక్షరటుడే, వెబ్డెస్క్ : Justice Gavai | హిందువుల మనోభావాలు దెబ్బతీశారని వస్తున్న విమర్శలపై భారత ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయ్ స్పందించారు. తాను ఏ మతాన్ని కించపరచలేదని, తనకు అన్ని మతాలపై గౌరవం ఉందని స్పష్టం చేశారు.
యునెస్కో జాబితాలో ఉన్న మధ్యప్రదేశ్లోని ఖజురహో ఆలయ సముదాయంలోని జవారీ ఆలయంలో (Jawari Temple) ఏడు అడుగుల విష్ణువు విగ్రహాన్ని పునర్నిర్మించి తిరిగి ఏర్పాటు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు సెప్టెంబర్ 16న తోసిపుచ్చింది. ఈ పిటిషన్పై విచారణ సందర్భంగా సీజేఐ గవాయ్ (CJI Gavai) చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. మీరు విష్ణువు భక్తుడైతే వెళ్లి విగ్రహాన్ని పునరుద్ధరించాలని ఆయననే ప్రార్థించాలని వ్యాఖ్యానించారు. సీజేఐ వ్యాఖ్యలపై తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి.
Justice Gavai | తప్పుగా చిత్రీకరించారన్న గవాయ్..
అయితే విమర్శలు వెల్లువెత్తడంతో భారత ప్రధాన న్యాయమూర్తి BR గవాయ్ గురువారం స్పందించారు. అన్ని మతాల పట్ల తనకు గౌరవం ఉందని పునరుద్ఘాటించారు. “తాను చేసిన వ్యాఖ్యలను సోషల్ మీడియాలో తప్పుగా చిత్రీకరించారని ఎవరో నాకు చెప్పారు. నేను అన్ని మతాలను గౌరవిస్తాను” అని ఓ వార్త సంస్థతో వ్యాఖ్యానించారు. మరోవైపు, సీజేఐకి సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా మద్దతుగా నిలిచారు. చిన్న చిన్న సంఘటనలకు సోషల్ మీడియాలో భారీగా ప్రతిస్పందనలు రావడం ఈమధ్య ఎక్కువై పోయిందన్నారు. “మనం ప్రస్తుత ఘటనను చూశాము. ప్రతి చర్యకు సమాన ప్రతిచర్య ఉంటుందని న్యూటన్ థియారీ ఉంది, కానీ ఇప్పుడు ప్రతి చర్యకు సోషల్ మీడియాలో అసమాన ప్రతిచర్య ఉంటుంది మిలార్డ్” అని పేర్కొన్నారు.
Justice Gavai | వెళ్లి దేవుడ్ని ప్రార్థించండి..
మధ్యప్రదేశ్లోని (Madhya Pradesh) జవారీ ఆలయంలో దెబ్బ తిన్న విష్ణువు విగ్రహాన్ని పునర్నిర్మించాలని కోరుతూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు (Supreme Court) తోసిపుచ్చింది. దీనిని ప్రచార ప్రయోజన వ్యాజ్యంగా పేర్కొంది. ఈ సమస్య భారత పురావస్తు సర్వే ఆఫ్ ఇండియా పరిధిలోకి వస్తుందన్నారు. “ఇది పూర్తిగా ప్రచార ప్రయోజన వ్యాజ్యం. వెళ్లి దేవుడిని ఏదైనా చేయమని అడగండి. మీరు బలంగా విష్ణువును ఆరాధిస్తుంటే వెళ్లి విగ్రహాన్ని పునర్నిర్మించాలని ఆయనను ప్రార్థించండి.” అని గవాయ్ అన్నారు. “ఈలోగా, మీరు శైవ మతం పట్ల విముఖత చూపకపోతే, మీరు అక్కడికి వెళ్లి పూజించవచ్చు. ఖజురహోలో అతిపెద్ద శివలింగాలలో ఒకటైన శివలింగం చాలా పెద్దది” అని ఆయన వెక్కిరించేలా వ్యాఖ్యానించడం హిందువుల మనోభావాలు దెబ్బతీసింది.
Justice Gavai | ఖండించిన వీహెచ్పీ
సీజేఐ గవాయ్ వ్యాఖ్యలపై స్పందించిన విశ్వ హిందూ పరిషత్.. ఆయన వ్యాఖ్యలు హిందూ మత విశ్వాసాలను అపహాస్యం చేశాయని మండిపడింది. కోర్టులు విచారణ సందర్భంగా సంయమనం పాటించాలని VHP అధ్యక్షుడు అలోక్ కుమార్ కోరారు. “ఖజురహోలోని ప్రసిద్ధ జవారీ ఆలయంలో ఉన్న విరిగిన విష్ణువు విగ్రహాన్ని మరమ్మతు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు విచారించింది. విచారణ సందర్భంగా “విగ్రహం మరమ్మతుల కోసం దేవుడిని ప్రార్థించండి. మీరు విష్ణువును బలంగా ఆరాధిస్తామని అంటున్నారు, కాబట్టి ఇప్పుడు ఆయనను ప్రార్థించండి.” ప్రధాన న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. కోర్టు అంటే న్యాయ దేవాలయం. భారతీయ సమాజానికి కోర్టులపై విశ్వాసం, నమ్మకం ఉంది. ఈ నమ్మకం చెక్కుచెదరకుండా ఉండటమే కాకుండా దానిని బలోపేతం చేసేలా చూసుకోవడం మనందరి విధి. ముఖ్యంగా కోర్టు గదిలో మాట్లాడే సమయంలో సంయమనం పాటించాల్సిన బాధ్యత కూడా అందరిపైనా ఉంది. ప్రధానంగా న్యాయవాదులతో పాటు న్యాయమూర్తులపైనా ఉంది. ప్రధాన న్యాయమూర్తి మౌఖిక వ్యాఖ్యలు హిందూ మత విశ్వాసాలను అపహాస్యం చేశాయని మేం భావిస్తున్నాం. అలాంటి వ్యాఖ్యలు చేయకుండా ఉండడం మంచిది” అని వీహెచ్పీ ‘X’లో పోస్టు చేసింది.