HomeUncategorizedAssam | సివిల్​ సర్వీసెస్​ అధికారిణి ఇంట్లో నోట్ల కట్టలు.. షాకైన అధికారులు

Assam | సివిల్​ సర్వీసెస్​ అధికారిణి ఇంట్లో నోట్ల కట్టలు.. షాకైన అధికారులు

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Assam | దేశంలో అవినీతి అధికారులకు కొదవ లేకుండా పోయింది. ప్రభుత్వ కార్యాలయాల్లోని అటెండర్​ నుంచి మొదలు పెడితే సివిల్​ సర్విసెస్​ అధికారుల వరకు అక్రమాలకు పాల్పడుతున్నారు.

ఓ సివిల్​ సర్వీసెస్​ (Civil Services) అధికారిణి ఇంట్లో అధికారులు సోదాలు నిర్వహించారు. ఆమె ఇంట్లో నోట్ల కట్టలు, బంగారు ఆభరణాలు చూసి తనిఖీలకు వెళ్లిన అధికారులే షాక్​ అయ్యారు. అస్సాం (Assam)కు చెందిన సివిల్‌ సర్వీస్‌ అధికారి నుపుర్‌ బోరాపై అనేక ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం ఆమె కమ్రూప్‌లో సర్కిల్ అధికారిగా విధులు నిర్వహిస్తున్నారు. 2019లో అస్సాం సివిల్ సర్వీసులో చేరారు. గువాహటికి చెందిన ఆమెపై భూ కుంభకోణానికి సంబంధించి ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో ఆమెపై ఆరు నెలలుగా నిఘా ఉంచినట్లు సీఎం హిమంత బిశ్వశర్మ (CM Himanta Biswas Sharma) తెలిపారు. సోమవారం సీఎం విజిలెన్స్​ అధికారులు ఆమె ఇంట్లో సోదాలు చేపట్టారు.

Assam | భారీగా బంగారు ఆభరణాలు

నుపుర్​ బోరా బార్పేట్‌ జిల్లాలో సర్కిల్‌ ఆఫీసర్‌గా ఉన్న సమయంలో డబ్బుకు బదులుగా భూమిని లంచంగా తీసుకున్నట్లు సమాచారం. తనిఖీల సమయంలో ఆమె ఇంట్లో భారీగా నోట్ల కట్టలు, బంగారు ఆభరణాలు లభ్యం అయ్యాయి. రూ.90 లక్షల నగదు, రూ.కోటి విలువైన బంగారు ఆభరణాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోలీసులు ఆమెను అరెస్ట్​ చేశారు. ఈ ఘటనపై సీఎం విజిలెన్స్‌ ఎస్పీ రోజీ కలిత మాట్లాడుతూ.. కేసు దర్యాప్తు కొనసాగుతోందన్నారు. కాగా నుపుర్​ బోరా సహాయకుడిగా పనిచేసిన లాట్‌ మండల్‌ సురాజిత్‌ డేకా నివాసంలో కూడా అధికారులు తనిఖీలు చేపట్టారు. అతడిని కూడా అరెస్ట్​ చేయడానికి అధికారులు సిద్ధం అవుతున్నారు.