అక్షరటుడే, ఇందూరు: Bigala Ganesh Gupta | అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్ బీఆర్ఎస్ మాత్రమేనని మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా (Bigala Ganesh Gupta) అన్నారు. నగరంలో నిలిచిపోయిన ఖలీల్వాడిలో ఇంటిగ్రేటెడ్ వెజ్ అండ్ నాన్‌వెజ్ మార్కెట్ నిర్మాణ పనులను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నగరంలో బీఆర్ఎస్ హయాంలో జరిగిన అభివృద్ధి మాత్రమే కనిపిస్తుందన్నారు.
Bigala Ganesh Gupta | రెండేళ్లలో ఎలాంటి అభివృద్ధి లేదు..
బిగాల మాట్లాడుతూ గడిచిన రెండేళ్లలో నగరంలో ఎలాంటి అభివృద్ధి పనులు చేయకపోవడం ప్రస్తుత ఎమ్మెల్యే అలసత్వంగా భావిస్తున్నామన్నారు. గోడల మీద రాతలు కాదు నగరాన్ని అభివృద్ధి చేసి చూపించాలన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో శంభుని గుడి (Shambuni Gudi) ప్రాంతంలో దుకాణాల తొలగించాలని పట్టుపట్టిన ఎంపీ, ఎమ్మెల్యేలు ఇప్పుడు వారి హయాంలో ఎందుకు తొలగించట్లేదో స్పష్టం చేయాలన్నారు. మార్కెట్ కాంప్లెక్స్‌లో దుకాణాల నిర్మాణాలు పూర్తయినప్పటికీ వారికి దుకాణాలు ఎందుకు కేటాయించట్లేదో వివరించాలన్నారు. మార్కెట్ పనులను బీఆర్ఎస్ హయాంలోనే సింహభాగం పూర్తి చేశామని.. స్థానిక బీజేపీ ఎమ్మెల్యే రెండేళ్లయిన మిగతా పనులు పూర్తి చేయించకపోవడం నిర్లక్ష్యమేనన్నారు. అభివృద్ధి పనులు చేసే ఆలోచన లేకపోయినా కనీసం పెండింగ్ పనులైననా పూర్తి చేయించే బాధ్యత తీసుకోవాలని ఆయన ఎమ్మెల్యేను ఉద్దేశించి మాట్లాడారు.
Bigala Ganesh Gupta | రెండేళ్లలో కేవలం రూ.10 కోట్లు మాత్రమే..
రెండేళ్ల బీజేపీ ఎమ్మెల్యే పాలనలో నగరానికి కేవలం రూ.10 కోట్లు మాత్రమే వచ్చాయని దీనిని బట్టి చూస్తే ఎమ్మెల్యే ఎలా పనిచేస్తున్నారో తెలిసిపోతుందని బిగాల అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నగరం విద్యుత్ కాంతులతో వెలిగిపోయేదని ఇప్పుడు ఏ కాలనీలో చూసినా అంధకారమే కనిపిస్తోందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా అదుపు తప్పిందని ఆరోపించారు. నగర నడిబొడ్డున ఓ కానిస్టేబుల్ హత్యకు గురయ్యాడని.. శనివారం ఏకంగా ఓ మహిళా కానిస్టేబుల్‌ను (female constable) కారుతో ఢీకొట్టడం చూస్తుంటే అర్బన్‌లో సామాన్య ప్రజలకు ఎవరు దిక్కని ఆయన ప్రశ్నించారు. కార్యక్రమంలో నగర మాజీ మేయర్ దండు నీతూ కిరణ్ శేఖర్, బీఆర్ఎస్ నగర ఆధ్యక్షుడు సిర్పరాజు, నుడా మాజీ ఛైర్మన్ ప్రభాకర్ రెడ్డి, సీనియర్ నాయకులు సత్యప్రకాష్, సుజిత్ ఠాకూర్, జగత్ రెడ్డి, నవీద్ ఇక్బాల్, ఇమ్రాన్ షహజాద్, అబ్దుల్ మతిన్ ఇతర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.