అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Chris Gayle | వెస్టిండీస్ దిగ్గజ బ్యాట్స్‌మెన్, యూనివర్సల్ బాస్‌గా పేరొందిన క్రిస్ గేల్ (Chris Gayle) తాజాగా పంజాబ్ కింగ్స్ ఫ్రాంఛైజీపై సంచలన వ్యాఖ్యలు చేశాడు.
పంజాబ్ తనను అవమానించిందంటూ ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో గేల్ చెప్పాడు. పంజాబ్ నన్ను గౌరవించలేదు.. చిన్నపిల్లాడిలా ట్రీట్ చేశారని ఆయన అన్నాడు. 2021 ఐపీఎల్ సీజన్ సమయంలో పంజాబ్ ఫ్రాంఛైజీ తనతో అనుచితంగా ప్రవర్తించిందని ఆరోపించాడు. ‘‘ఒక సీనియర్ ఆటగాడినైనా నన్ను చిన్నపిల్లాడిలా చూడడం నాకు బాధ కలిగించింది. ఫ్రాంఛైజీ వైఖరి కారణంగా మానసిక ఒత్తిడికి లోనయ్యాను. అదే తొలిసారి నా జీవితంలో డిప్రెషన్ అనిపించింది” అని గేల్ వివరించాడు.
Chris Gayle | నా మనసు ఒప్పుకోలేదు
ఐపీఎల్ 2021 రెండో దశలో, యూఏఈలో జరుగుతున్న మ్యాచ్‌ల మధ్యలోనే గేల్ ఫ్రాంచైజీని విడిచి స్వదేశానికి వెళ్లిపోయిన విషయం తెలిసిందే. దీనిపై గేల్ మాట్లాడుతూ.. డబ్బు సంగతి కాదండి.. మానసిక ఆరోగ్యం కోసం.. దాన్ని కాపాడుకోవాలి అనిపించింది. కోచ్ అనిల్ కుంబ్లేకు కాల్ చేసి నా పరిస్థితి వివరించాను. ఆ సమయంలో కుంబ్లే ముందు కన్నీళ్లు పెట్టుకున్నాను అని గేల్ పేర్కొన్నాడు. ఆ సమయంలో పంజాబ్ కెప్టెన్‌గా ఉన్న కేఎల్ రాహుల్ (Kl Rahul) ఫోన్ చేసి జట్టులోనే కొనసాగాలని, తదుపరి మ్యాచ్‌లో ఆడాలని అభ్యర్థించినా తన నిర్ణయాన్ని మార్చుకోలేదని వెల్లడించాడు. ఆఫర్ ఉన్నా, నా మనసు ఒప్పుకోలేదు. ఫ్రాంఛైజీ ప్రవర్తనతో ఇప్పటికే నేను తీవ్రంగా బాధపడ్డా. అందుకే నా బ్యాగ్ తీసుకుని బయటికి వచ్చేశాను” అని చెప్పాడు.
2021లో గేల్ గణాంకాలు చూస్తే.. మొత్తం మ్యాచ్‌లు: 10, పరుగులు: 193, సగటు: 21.44, అధిక స్కోరు: 46.
పంజాబ్ 2018లో గేల్‌ను వేలంలో కొనుగోలు చేసి జట్టులోకి తీసుకుంది. కానీ 2021లో గేల్ ఐపీఎల్‌కు వీడ్కోలు పలికాడు. గేల్ చెప్పిన వివరాల ప్రకారం, ముంబై ఇండియన్స్‌తో (Mumbai Indians) ఆఖరి మ్యాచ్ ఆడిన తర్వాత, తనకు ఇక ఆ వాతావరణంలో కొనసాగడం కష్టంగా అనిపించిందట. ‘‘శాంతి లేని చోట ఉండలేను. అదే సమయంలో బయోబబుల్ ఒత్తిడితో కలిసి మానసికంగా పూర్తిగా కుంగిపోయాను” అని అన్నారు. ఈ ఇంటర్వ్యూలో గేల్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఫ్రాంచైజీ మాత్రం ఇంకా దీనిపై స్పందించలేదు.