అక్షరటుడే, వెబ్డెస్క్: Megastar Chiranjeevi | మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కిన తెలుగు కామెడీ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘మన శంకర వరప్రసాద్ గారు’ (Mana Shankara Varaprasad Garu) సంక్రాంతి బరిలోకి దిగేందుకు సిద్ధమైంది. హిట్ డైరెక్టర్ అనిల్ రావిపూడి (Director Anil Ravipudi) దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో విక్టరీ వెంకటేష్ కీలక పాత్రలో కనిపిస్తుండటం సినిమాపై మరింత ఆసక్తిని పెంచింది.
షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై సాహు గారపాటి, సుష్మిత కొణిదెల (Sushmita Konidela) నిర్మించిన ఈ సినిమాను శ్రీమతి అర్చన సమర్పిస్తున్నారు. నయనతార కథానాయికగా నటించిన ఈ చిత్రం జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా విడుదలకు ముందే ప్రమోషన్లలో భాగంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది.
Megastar Chiranjeevi | సంక్రాంతి సినిమాల హంగామా..
ఈ వేదికపై మెగాస్టార్ చిరంజీవి చేసిన ప్రసంగం ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. ట్రైలర్, పాటలు సినిమాపై అంచనాలను ఇప్పటికే పెంచగా, ఈ ఈవెంట్‌తో హైప్ మరింత బలపడింది. ముఖ్యంగా చిరంజీవి సంక్రాంతి సీజన్‌లో విడుదలవుతున్న ఇతర హీరోల సినిమాలపై చేసిన వ్యాఖ్యలు అభిమానులను ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ, ఈ సంక్రాంతి ఒక్క సినిమా లేదా ఒక్క హీరోకే పరిమితం కాకుండా, మొత్తం తెలుగు చిత్ర పరిశ్రమకు పండుగలా మారాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు. ప్రభాస్, రవితేజ, శర్వానంద్, నవీన్ పోలిశెట్టి (Naveen Polishetty) వంటి నటుల సినిమాల గురించి ప్రస్తావిస్తూ, వీరందరూ తనకు కుటుంబ సభ్యుల్లాంటివారేనని భావోద్వేగంగా చెప్పారు. చిన్నప్పటి నుంచి తన ఇంట్లో తిరుగుతూ పెరిగినవారు, తనను గురువుగా భావించే శిష్యులు ఇలా ప్రతి ఒక్కరితో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేశారు.
ఈ సంక్రాంతికి ప్రభాస్ నటించిన ‘ది రాజాసాబ్’(The Rajasaab), రవితేజ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’, శర్వానంద్ ‘నారీ నారీ నడుమ మురారి’, నవీన్ పోలిశెట్టి ‘అనగనగా ఒక రాజు’ వంటి చిత్రాలు విడుదలవుతున్న నేపథ్యంలో, అన్ని సినిమాలు ఘన విజయం సాధించాలని చిరంజీవి మనస్ఫూర్తిగా కోరారు. తెలుగు చిత్ర పరిశ్రమ సుభిక్షంగా ఉండాలంటే ప్రేక్షకులే పెద్ద బలం అని చెప్పిన ఆయన, థియేటర్లకు వెళ్లి సినిమాలను ఆస్వాదించాలని విజ్ఞప్తి చేశారు.తన సినిమా గురించి మాట్లాడిన చిరంజీవి, ఇది పక్కా సంక్రాంతి ఎంటర్‌టైనర్ అని ధీమా వ్యక్తం చేశారు. గతంలో ‘ఘరానా మొగుడు’ లాంటి భారీ విజయాన్ని అందించిన దర్శకుడు కె. రాఘవేంద్ర రావు ఈ సినిమాకు ఆశీర్వాదంగా నిలిచారని, ఆయన చేతుల మీదుగానే సినిమా ప్రారంభమైందని గుర్తు చేశారు. అలాంటి మరో మైలురాయి విజయం సాధించాలనే ఆశతోనే ఈ సినిమా చేశామని చిరు తెలిపారు.