అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Megastar Chiranjeevi | డీప్‌ఫేక్ టెక్నాలజీ ఇప్పుడు సెలబ్రిటీలకు పెద్ద తలనొప్పిగా మారింది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంగా రూపుదిద్దుకున్న ఈ టెక్నాలజీని కొందరు చెడు ఉద్దేశ్యాలతో వాడుతూ, ప్రముఖుల గౌరవాన్ని దెబ్బతీసే విధంగా మార్ఫ్ చేసిన వీడియోలను సృష్టిస్తున్నారు.
ఇప్పటికే బాలీవుడ్ హీరోయిన్లు కాజోల్, కత్రినా కైఫ్, రష్మిక మందన్న వంటి ప్రముఖులు డీప్‌ఫేక్ వీడియోల బారిన పడ్డారు. తాజాగా టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) కూడా ఈ జాబితాలో చేరారు. కొందరు దుండగులు చిరంజీవి ఫోటోలను మార్ఫ్ చేసి అశ్లీల వీడియోలుగా తయారు చేసి, వాటిని సోషల్ మీడియాలో మరియు వెబ్‌సైట్లలో పోస్ట్ చేశారు. ఆ వీడియోలు కొద్ది గంటల్లోనే వైరల్ అయ్యాయి. ఈ ఘటనపై తీవ్రంగా ఆగ్రహించిన మెగాస్టార్ వెంటనే హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ (CP VC Sajjanar)కు ఫిర్యాదు చేశారు.
Megastar Chiranjeevi | చిరు ఫైర్..
సైబర్ క్రైమ్ పోలీసులు (Cyber Crime Police) ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. తన పేరును దెబ్బతీసేలా, వ్యక్తిత్వాన్ని అవమానించేలా డీప్‌ఫేక్ వీడియోలు తయారు చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని చిరంజీవి కోరారు.డీప్‌ఫేక్‌ల పెరుగుదలపై సైబర్ నిపుణులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. టెక్నాలజీ సద్వినియోగం కాకుండా దుర్వినియోగం అవుతోందని, సామాజిక మాధ్యమాల వేదికలపై ఇలాంటి వీడియోలను షేర్ చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు సూచిస్తున్నారు.
ఈ ఘటనతో మరోసారి డీప్‌ఫేక్ (Deepfake) ముప్పు ఎంత తీవ్రమైందో స్పష్టమవుతోంది. టెక్నాలజీ అభివృద్ధి మానవ జీవితానికి ఉపయోగపడాలేకాని, వ్యక్తుల గౌరవాన్ని దెబ్బతీయడానికి కాదు అని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. కాగా, చిరంజీవి ప్రస్తుతం పలు ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఆయన నటించిన మన శంకర వరప్రసాద్ గారు చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానుంది. ఆ తర్వాత విశ్వంభర చిత్రంతో పలకరించనున్నాడు. అనంతరం బాబీతో కలిసి క్రేజీ ప్రాజెక్ట్ చేస్తుండగా, ఈ చిత్రం కూడా వచ్చే ఏడాది విడుదలయ్యేలా కనిపిస్తుంది.
