అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Chiranjeevi Charitable Trust | ప్రముఖ సినీనటుడు, కేంద్ర మాజీ మంత్రి మెగాస్టార్ చిరంజీవికి కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వము పెద్ద శుభవార్తను అందించింది. చిరంజీవి నిర్వహిస్తున్న సేవా సంస్థ ‘చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్’ ను ఎఫ్సీఆర్ఏ (Foreign Contribution Regulation Act) కింద నమోదు చేసేందుకు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఆమోదం తెలిపినట్లు సమాచారం.
హైదరాబాద్ (Hyderabad) జూబ్లీ హిల్స్‌లోని జవహర్ కాలనీలో చిరంజీవి 1998లో ఈ చారిటబుల్ ట్రస్ట్‌ను స్థాపించారు. ఇందులో భాగంగా చిరంజీవి బ్లడ్ బ్యాంక్, చిరంజీవి ఐ బ్యాంక్ అనే రెండు ప్రధాన సేవా సంస్థలు పనిచేస్తున్నాయి. పేదలకు రక్తం, కంటి దానాలు పూర్తిగా ఉచితంగా అందించడంలో ఈ రెండు సంస్థలు సంవత్సరాలుగా కీలక పాత్ర పోషిస్తున్నాయి. వేల మందికి ప్రాణదాతలుగా నిలిచాయి.
Chiranjeevi Charitable Trust | విదేశీ విరాళాలకు గ్రీన్ సిగ్నల్
తాజాగా కేంద్ర హోం శాఖ నుంచి వచ్చిన ఎఫ్సీఆర్ఏ ఆమోదంతో ఇప్పుడు చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ విదేశీ విరాళాలను అధికారికంగా స్వీకరించగలదు. విదేశీ నిధులను స్వీకరించే ఏ ఎన్జీఓ అయినా 2010 ఎఫ్సీఆర్ఏ చట్టం కింద నమోదు కావాల్సి ఉంటుంది. ఇటీవల నిబంధనలు మరింత కఠినతరం కావడంతో, ట్రస్ట్ అధికారికంగా దరఖాస్తు చేసుకోగా, కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah) ఆమోదం తెలిపినట్లు అధికారులు వెల్లడించారు.ఇది ట్రస్ట్ కార్యకలాపాలను మరింత విస్తృతం చేయడానికి, సేవలను మరింత పెద్ద స్థాయిలో అందించడానికి దోహదపడనుంది.
27 ఏళ్ల క్రితం చిరంజీవి ఈ ట్రస్ట్‌ని ప్రారంభించగా, అప్పటి నుంచి చిరంజీవి బ్లడ్ బ్యాంక్ (Chiranjeevi Blood Bank) వేలాది మంది ప్రాణాలను కాపాడడంలో కీలక పాత్ర పోషించింది. మెగాస్టార్ అభిమానులు ఇప్పటికీ విస్తృతంగా రక్తదాన శిబిరాల్లో పాల్గొంటూ ఈ సేవా కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. ప్రస్తుతం బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ మాత్రమే కాకుండా, చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ పలు ఇతర సేవా కార్యక్రమాల్లోనూ పాల్గొంటోంది. దాదాపు ప్రతి సేవా కార్యక్రమంలో చిరంజీవి అభిమానులు స్వచ్ఛందంగా ముందుకు రావడం విశేషం. ఇప్పటికే వేల మందికి అండగా నిలిచిన చిరంజీవి సేవా సంస్థలు ఇకపై మరింత పెద్ద స్థాయిలో ప్రజలకు మేలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.