అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Chirala Beach | ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పర్యాటక రంగంలో ఒక ప్రధాన గమ్యస్థానంగా అభివృద్ధి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం(State Government) పటిష్టమైన ప్రణాళికలతో ముందుకు సాగుతోంది.
ఈ క్రమంలో గోవా పర్యాటక మోడల్‌ను అధ్యయనం చేసి, ఏపీలోని సముద్ర తీర ప్రాంతాల్లో ప్రత్యేకంగా చీరాల బీచ్‌ను గోవా తరహాలో అభివృద్ధి చేయనున్నట్టు పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ శాసనసభ వేదికగా ప్రకటించారు.శాసనసభ సమావేశాల్లో మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ, రాష్ట్రంలో సముద్ర ఆధారిత పర్యాటక అభివృద్ధికి బృహత్తర ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలిపారు. విజయవంతమైన గోవా పర్యాటక నమూనాను స్ఫూర్తిగా తీసుకుని చీరాల బీచ్‌ను అంతర్జాతీయ స్థాయి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
Chirala Beach | రూ.10,644 కోట్ల పెట్టుబడులు
గత 15 నెలల్లో ఏపీ టూరిజం శాఖ(AP Tourism Department), 103 సంస్థలతో ఎంవోయూలు కుదుర్చుకుని, రూ.10,644 కోట్ల విలువైన పెట్టుబడులను రాష్ట్రానికి రప్పించగలిగినట్టు మంత్రి వెల్లడించారు. వివిధ ప్రాంతాల్లో హోటళ్లు, రిసార్టులు, వెల్‌నెస్ సెంటర్లను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. చీరాల బీచ్ అభివృద్ధితో పాటు, సమీప ప్రాంతాల్లోని చారిత్రక ప్రదేశాలు, మోటుపల్లి, పురాతన వీరభద్రస్వామి గుడి వంటి ప్రదేశాలను ప్రధాన పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం కృషి చేస్తోంది. రహదారి అనుసంధానత, మౌలిక సదుపాయాల మెరుగుదలపై దృష్టి పెట్టినట్టు మంత్రి స్పష్టం చేశారు.పర్యాటక ప్రాజెక్టుల అమలుకు కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా ఇప్పటివరకు రూ.441 కోట్ల నిధులు రాష్ట్రానికి వచ్చాయని మంత్రి తెలిపారు. పర్యాటక శాఖను ఆధునీకరించి, కొత్త ఆవిష్కరణలకు శ్రీకారం చుట్టామని చెప్పారు.
చీరాల బీచ్(Chirala Beach) అభివృద్ధిపై చర్చ సందర్భంగా ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య హర్షం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో స్పీకర్ అయ్యన్నపాత్రుడు, గోవా పర్యాటక నమూనాను అమలు చేయడానికి ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలని సూచించగా, దీనిని మంత్రి దుర్గేష్ ఆమోదిస్తూ, త్వరితగతిన అమలు చేస్తామని హామీ ఇచ్చారు.పర్యాటక రంగంలో ఏపీ తీసుకుంటున్న ఈ భారీ ముందడుగులు, గోవా తరహాలో తీర ప్రాంతాల అభివృద్ధి దిశగా ప్రభుత్వం చేస్తున్న చొరవ, విదేశీ మరియు దేశీ పర్యాటకులను ఆకర్షించే విధంగా మారుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. విశేషంగా అభివృద్ధి చెందుతున్న చీరాల బీచ్, రాష్ట్రానికి పర్యాటక ఆదాయాన్ని పెంచే ప్రధాన కేంద్రంగా మారనుంది.