అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Chirala Beach | రెండు రోజులు సెలవులు వచ్చాయంటే కుటుంబం, మిత్రులందరితో కలిసి ఎక్కడికైనా వెళ్లొద్దామనుకునే సమయం ఇది. పచ్చగా కనిపించే ప్రకృతి ఒడిలో వాలాలని, ఒక బీచ్ ట్రిప్ ప్లాన్ చేయాలని చాలా మంది అనుకుంటారు.
అయితే బీచ్ అనగానే చాలామందికి గోవా గానీ, కేరళ గానీ గుర్తొస్తాయి. కానీ, హైదరాబాద్ (Hyderabad) చుట్టూ ఉన్న బీచ్‌లను చాలామంది మర్చిపోతుంటారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లోని తీర ప్రాంతాలు బీచ్ లవర్స్‌కు స్వర్గధామంలా మారాయి. మీ బడ్జెట్‌కు తగ్గట్టుగా, ట్రావెల్ సౌకర్యాలతో హైదరాబాద్‌కు చాలా దగ్గరలో పలు బీచ్‌లు ఉన్నాయి. వాటిలో చీరాల బీచ్ ఈ మధ్య కాలంలో చాలా మంది దృష్టిని ఆకర్షిస్తుంది.
Chirala Beach | ఆహ్లాదంతో..
దసరా సెలవులకు గాను చాలా మంది చీరాల బీచ్‌కు (Chirala Beach) క్యూ కట్టారు. ఫ్యామిలీస్‌తో వెళ్లి నాలుగు రోజుల పాటు అక్కడ సరదాగా గడిపారు. చీరాల పట్టణానికి సమీపంలో ఉన్న ఓడరేవు, రామాపురం బీచ్‌లకు (Ramapuram Beach) చాలా ప్రత్యేకత ఉంది. అక్కడ పిల్లలతో పాటు పెద్దలు కూడా చాలా సరదాగా గడిపేలా ఉంటుంది. హైదరాబాద్ నుంచి 340 కి.మీ.ల దూరంలో ప్రకాశం జిల్లాలోని ఉన్న ఈ బీచ్‌లో స్వచ్ఛమైన ఇసుక, నీటిని కలిగి ఉంటుంది. ఇక్కడకు వచ్చే సందర్శకులకు వినోదానికి కొదవలేదు అని చెప్పాలి. ఉరుకులు పరుగుల జీవితానికి కాస్త బ్రేక్ ఇచ్చి సరదాగా ఎంజాయ్ చేయాలని అనుకునే వారు చీరాల బీచ్‌కు వచ్చి వెళుతుంటారు. అక్కడి ఆహ్లాద వాతావరణం ప్రతి ఒక్కరిని ఎంతగానో కట్టిపడేస్తుంది.
అక్కడికి వెళ్లాలనుకునే వారు సికింద్రాబాద్ నుంచి తిరుపతి, చెన్నై వెళ్లే ట్రైన్ ఎక్కి చీరాలలో దిగితే, అక్కడి నుంచి బస్సులు, లేదా ప్రైవేటు వాహనాల్లో ఓడరేవు బీచ్‌కు చేరుకునే అవకాశం ఉంటుంది. ఇక్కడి సముద్రాన్ని, ఆ ప్రాంతాలను చూసిన వారు మరోసారి రాకుండా ఉండలేరు. చీరాల బీచ్ ప్రాంతాన్ని గోవా నమూనాతో అభివృద్ధి చేస్తామంటూ ఇటీవల మంత్రి కందుల దుర్గేష్ (Minister Kandula Durgesh) స్పష్టం చేశారు. మంత్రి సమాధానం పట్ల చీరాల ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య ఆనందం వ్యక్తం చేశారు. గోవా పర్యటకాన్ని అధ్యయనం చేసి ఆ నమూనాను ఏపీలో అమలు చేసేలా, తద్వారా పర్యాటక ఆదాయం పెంపొందేలా చర్యలు తీసుకొనేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. మరోవైపు చీరాల బీచ్‌కు 22 కి.మీ దూరంలో సూర్యలంక బీచ్ ఉంది. సందర్శకులు వసతి పొందేందుకు వీలుగా ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌కు (APTDC) చెందిన హరిత బీచ్ రిసార్ట్ (Haritha Beach Resort) కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. వారంతంలో ఈ రెండు బీచ్‌లకు హైదరాబాద్ నుంచి చాలా మంది పర్యాటకులు వచ్చి వెళుతుంటారు.