అక్షరటుడే, వెబ్‌డెస్క్ : China Women | చైనాలోని తూర్పు ప్రాంతంలో ఒక వృద్ధ మహిళ చేసిన అశాస్త్రీయ నాటు వైద్య ప్రయత్నం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. నడుము నొప్పి(Back Pain)ని తగ్గించుకునేందుకు బతికిన కప్పలను మింగిన 82 ఏళ్ల జాంగ్ అనే మహిళ తీవ్ర ఇబ్బందులని ఎదుర్కోవలసి వచ్చింది.
చాలా కాలంగా హెర్నియేటెడ్ డిస్క్(Herniated Disc) కారణంగా తీవ్రమైన నడుము నొప్పితో బాధపడుతున్న జాంగ్, ఓ నాటు వైద్య పద్ధతిని నమ్మింది. బతికిన కప్పలను(Live Frogs) మింగితే నడుము నొప్పి తగ్గుతుంది అనే అపోహకు లోనై, తన కుటుంబ సభ్యులను కప్పలు తెమ్మని కోరింది. కుటుంబ సభ్యులు కప్పలు తెచ్చిపెట్టగానే, వాటిని వండకుండా, శుభ్రం చేయకుండా ఆ కప్పలని నేరుగా మింగేసింది. మొదటి రోజు మూడు కప్పలు, తర్వాత రోజు ఐదు మొత్తం ఎనిమిది కప్పలను ఆమె మింగింది.
China Women | తీవ్రమైన కడుపు నొప్పి..
కప్పలు మింగిన తర్వాత నడుము నొప్పి తగ్గడానికి బదులు, జాంగ్‌కు తీవ్రమైన కడుపు నొప్పి మొదలైంది. ఆమె నడవలేని స్థితికి చేరడంతో విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పింది. వెంటనే వారు ఆమెను హాంగ్‌జౌలోని జెజియాంగ్ యూనివర్సిటీ ఫస్ట్ అఫిలియేటెడ్ హాస్పిటల్ కు తరలించారు. ఆమెని పరీక్షించిన వైద్యులు జాంగ్ కడుపులో సజీవ కప్పల వల్ల ఏర్పడిన టేప్‌వార్మ్ లార్వా (స్పార్గానమ్), ఇతర హానికరమైన బ్యాక్టీరియాలను గుర్తించారు. బతికిన కప్పలు నేరుగా మింగిన కారణంగా ఆమె జీర్ణవ్యవస్థ పూర్తిగా దెబ్బతిందని, తీవ్రంగా ఇన్‌ఫెక్షన్ కలిగిందని తెలిపారు.
సుమారు రెండు వారాల పాటు ఐసీయూలో ICU చికిత్స పొందిన జాంగ్, చివరికి ప్రాణాపాయం నుంచి బయటపడింది. ప్రస్తుతం ఆమె కోలుకుని డిశ్చార్జ్ అయినట్టు సమాచారం. ఈ సంఘటనపై స్పందించిన వైద్యులు, “ఇలాంటి అశాస్త్రీయ వైద్య చిట్కాలను నమ్మకండి. ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉంటే వెంటనే ప్రొఫెషనల్ వైద్య సలహా తీసుకోవాలి” అని హితవు పలికారు. టెక్నాలజీతో పాటు వైద్య రంగం కూడా ఇంత అభివృద్ధి చెందుతున్న సమయంలో ఇలాంటి మూడ నమ్మకాలని ఇంకా పాటిస్తుండడం పట్ల కొందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.