అక్షరటుడే, వెబ్‌డెస్క్ :Pak – China | పహల్గామ్ ఉగ్రదాడి(Pahalgam terror attack)కి నిరసనగా భారత్ సిందూ జలాల ఒప్పందాన్ని రద్దు చేయడంతో పాకిస్తాన్ ఎడారిగా మారుతుందని అంతా భావించారు. తాగు, సాగునీటికి తీవ్ర ఇబ్బందులు తలెత్తడం ఖాయమని ఆశించారు. అయితే, కష్టాల్లో చిక్కుకున్న తన మిత్ర దేశానికి చైనా అండగా నిలుస్తోంది. పెషావర్‌కు ప్రతిరోజూ 300 మిలియన్ గ్యాలన్ల నీటిని సరఫరా చేయడానికి పాకిస్తాన్(Pakistan)లో ప్రపంచంలోనే 5వ ఎత్తైన ఆనకట్టను నిర్మిస్తోంది. ఇండియా సింధు జలాల ఒప్పందాన్ని (IWT) నిలిపివేసిన తర్వాత.. పాకిస్తాన్‌లో ఆనకట్ట పనులను వేగవంతం చేయాలని ఆ దేశం ప్రణాళికలు వేస్తున్నట్లు ప్రకటించింది.
Pak – China | వచ్చే ఏడాదికల్లా పూర్తి..
చైనా(China) ప్రభుత్వ యాజమాన్యంలోని చైనా ఎనర్జీ ఇంజనీరింగ్ కార్పొరేషన్ వాయువ్య పాకిస్తాన్‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లోని మొహమ్మద్ జలవిద్యుత్ ప్రాజెక్టుపై 2019 నుంచి పని చేస్తోంది. ఈ ప్రాజెక్టు వచ్చే ఏడాది పూర్తి కావాల్సి ఉంది. వీలైనంత త్వరగా ప్రాజెక్టును పూర్తి చేసేందుకు చైనా యత్నిస్తోంది. ఆనకట్టపై కాంక్రీట్ నింపడం ప్రారంభమైందని పాక్ ప్రభుత్వ టీవీ పేర్కొంది. “పాకిస్తాన్(Pakistan)కు ఈ జాతీయ ప్రధాన ప్రాజెక్టు కీలకమైన నిర్మాణ మైలురాయి. వేగవంతమైన అభివృద్ధి దశ” అని హాంకాంగ్‌కు చెందిన సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ నివేదించింది. ఈ ప్రాజెక్ట్ అధికారికంగా సెప్టెంబర్ 2019లో ప్రారంభమైంది. వచ్చే ఏడాదిలోపు పూర్తి కావాల్సి ఉంది.
Pak – China | సిందూయే ప్రాణాధారం..
వాస్తవానికి పాకిస్తాన్‌కు సిందూ నది(Indus River) మాత్రమే ఇన్నాళ్లు జీవనాడిగా నిలిచింది. ఆ దేశంలో 80 శాతం తాగు,సాగునీటి అవసరాలను సిందూ నది తీరుస్తుందని చెబుతారు. 1960లో ఇండియా, పాకిస్తాన్ మధ్య సిందూనది జలాల ఒప్పందం కుదిరింది. సింధూ జల ఒప్పందం ప్రకారం, పాకిస్తాన్ సింధూ, జీలం, చీనాబ్ నదుల జలాలను ఉపయోగించుకునే హక్కును కలిగి ఉంది. అయితే, ఏప్రిల్ 22న పహల్గామ్‌లో పర్యాటకులపై జరిగిన ఘోరమైన ఉగ్రవాద దాడి తర్వాత సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేస్తున్నట్లు భారతదేశం(India) ప్రకటించింది. పాక్‌కు జీవనాడి అయిన సిందూ నది ద్వారా ఆ దేశ జీడీపీలో 25 శాతం సిందూ నది పరీవాహక ప్రాంతం నుంచే సమకూరుతుంది. అలాంటి కీలకమైన సిందూ జలాలకు భారత్ చెక్ పెట్టింది.
Pak – China | బహుళార్ధక సాధక ప్రాజెక్టు
ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లోని మొహ్మండ్ ఆనకట్ట విద్యుత్ ఉత్పత్తి, వరద నియంత్రణ, నీటిపారుదల నీటి సరఫరా కోసం బహుళ ప్రయోజన సౌకర్యంగా పనిచేయడానికి రూపొందించారు. 800MW జలవిద్యుత్‌ను ఉత్పత్తి చేయడానికి, ఖైబర్ పఖ్తుంఖ్వా రాజధాని, అతిపెద్ద నగరమైన పెషావర్(Peshawar)కు రోజుకు 300 మిలియన్ గ్యాలన్ల తాగునీటిని సరఫరా చేసేలా ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నారు. మొహ్మండ్ ఆనకట్ట ప్రపంచంలో ఐదవ ఎత్తైన ఆనకట్టగా మారనుంది. 700 అడుగుల ఎత్తులో నిర్మితమవుతున్న ఇది ప్రపంచవ్యాప్తంగా ఐదవ ఎత్తైన ఆనకట్ట అవుతుంది, అంతేకాకుండా, ఈ ఆనకట్ట వేల ఎకరాల వ్యవసాయ భూములకు సాగునీరు అందిస్తుంది.
