అక్షరటుడే, వెబ్‌డెస్క్: China Nuclear Data Leak | చైనా సైనిక వ్యవస్థలో అత్యంత ప్రభావశీలమైన అధికారుల్లో ఒకరు తీవ్ర వివాదాల మధ్య చిక్కుకున్నారు. అవినీతి ఆరోపణలతో పాటు దేశానికి చెందిన ముఖ్యమైన అణ్వస్త్ర సమాచారాన్ని అమెరికాకు అందించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆయనపై విచారణ మొదలైందని అంతర్జాతీయ మీడియా కథనాలు వెలువడుతున్నాయి. ఈ సంఘటన చైనా సైన్యం (Chinese Army)లో విస్తృతంగా చర్చనీయాంశమైంది.
China Nuclear Data Leak | షీ జిన్‌పింగ్ సన్నిహితుడు జాంగ్ యూక్సియా
చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ (Chinese President Xi Jinping)కు అత్యంత దగ్గరి వ్యక్తిగా పేరొందిన జనరల్ జాంగ్ యూక్సియా (Zhang Yuxia) ప్రస్తుతం సెంట్రల్ మిలిటరీ కమిషన్ ఉపాధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. పీపుల్స్ లిబరేషన్ ఆర్మీలో అత్యున్నత స్థాయి నాయకత్వంలో ఆయన కీలక పాత్ర పోషిస్తున్నారు.
China Nuclear Data Leak | వాల్ స్ట్రీట్ జర్నల్ కథనంతో..
ఇటీవల అమెరికా (America)కు చెందిన ప్రముఖ పత్రిక వాల్ స్ట్రీట్ జర్నల్ సంచలన కథనం వెలువరించింది. చైనా అణు ఆయుధాల కార్యక్రమానికి సంబంధించిన కీలక సాంకేతిక వివరాలను జాంగ్ యూక్సియా అమెరికాకు లీకేజ్ చేసినట్లు కథనంలో పేర్కొంది. చైనా సైనిక ఉన్నత వర్గాల సమాచారాన్ని ఆధారంగా చేసుకొని ఈ కథనం రూపొందించినట్లు తెలుస్తోంది.
China Nuclear Data Leak | అవినీతి ఆరోపణలు
అంతేకాకుండా.. పదోన్నతుల సందర్భంగా లంచాలు స్వీకరించడం, జూనియర్ అధికారులపై ఒత్తిడి తెచ్చి వేధింపులకు పాల్పడడం, ఆయుధాల సేకరణ ప్రక్రియలో అవినీతికి వంటి ఆరోపణలు యూక్సియాపై వచ్చినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో చైనా రక్షణ శాఖ (China Defence Ministry) ఆయనపై ఉన్నతస్థాయి విచారణకు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం.
China Nuclear Data Leak | సామాజిక మాధ్యమాల్లో పుకార్లు
వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదిక ప్రచురణ తర్వాత సోషల్ మీడియా (Social Media) వేదికలపై జాంగ్ యూక్సియాపై మరిన్ని ఆరోపణలు వెల్లువెత్తాయి. అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌కు వ్యతిరేకంగా సైనిక తిరుగుబాటు ప్రయత్నాలు జరిగాయనే ప్రచారం వినిపిస్తోంది. ఈ సందర్భంలో యూక్సియాతో పాటు మరికొందరు ఉన్నత సైనిక అధికారులను అదుపులోకి తీసుకున్నారని కథనాలు వస్తున్నాయి. అయితే ఈ విషయాలను చైనా అధికారులు లేదా పశ్చిమ దేశాల నిఘా సంస్థలు ధ్రువీకరించలేదు.