అక్షరటుడే, వెబ్డెస్క్: children | పిల్లలను పెంచడం అంటే కేవలం మంచి చదువు, క్రమశిక్షణ అందించడం మాత్రమే కాదు. వారి మనసును ఆరోగ్యంగా ఉంచడం కూడా. పిల్లలు తమ తల్లిదండ్రులను చూసే ప్రతిదీ నేర్చుకుంటారు. వారి ఉత్సుకత కొద్దీ ఇంట్లో జరిగే ప్రతి విషయంపై ప్రశ్నలు అడుగుతుంటారు. అయితే, వారు అడిగారు కదా అని ప్రతి విషయాన్నీ వారితో పంచుకోవడం వారి మానసిక ఎదుగుదలపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. పిల్లల అమాయకత్వాన్ని కాపాడుతూ, వారిని మానసికంగా బలంగా ఉంచడానికి తల్లిదండ్రులు కొన్ని విషయాలను దాచడమే ఉత్తమమని నిపుణులు చెబుతున్నారు.
ఆర్థిక ఇబ్బందులు: children | ఇంట్లో డబ్బు సమస్యలు ఉన్నప్పుడు వాటిని పిల్లల ముందు చర్చించకండి. మన దగ్గర డబ్బులు లేవు, అప్పులు పెరిగిపోయాయి వంటి మాటలు పిల్లల్లో అభద్రతా భావాన్ని కలిగిస్తాయి. వారు బాధ్యతగా ఉండాలని మీరు అనుకోవచ్చు, కానీ అది వారిలో అనవసరమైన భయాన్ని, ఒత్తిడిని పెంచుతుంది. వారికి సురక్షితమైన వాతావరణాన్ని అందించడమే మీ మొదటి బాధ్యత.
గొడవలు: children | భార్యాభర్తల మధ్య అభిప్రాయ భేదాలు సహజం. కానీ, ఆ గొడవలకు గల కారణాలను పిల్లలకు వివరించాల్సిన పనిలేదు. ఏం జరిగిందని వారు అడిగితే.. ఇది పెద్దల మధ్య విషయం, మేము సర్దుబాటు చేసుకుంటాం అని సున్నితంగా చెప్పండి. మీ గొడవల్లో వారిని భాగస్వాములను చేయడం వల్ల వారు మానసిక ప్రశాంతతను కోల్పోతారు.
బంధువుల పట్ల వ్యతిరేకత: children | మీకు కొంతమంది బంధువులతో పడకపోవచ్చు. కానీ ఆ చేదును పిల్లలకు నూరిపోయకండి. వారు చెడ్డవారు, వారితో మాట్లాడకు.. అని చెప్పడం వల్ల పిల్లల మనసులో విషం నింపిన వారవుతారు. భవిష్యత్తులో మీ సంబంధాలు మెరుగుపడినా.. పిల్లల మనసులో పడిన ఆ ముద్ర చెరిగిపోదు. వారి భద్రతకు ముప్పు లేనంత వరకు వారిని అందరితో స్వేచ్ఛగా ఉండనివ్వండి.
వ్యక్తిగత బాధలు: children | జీవితంలో మీరు సాధించలేకపోయిన లక్ష్యాలను లేదా పాత గాయాలను పిల్లలపై రుద్దకండి. వ్యక్తిగత బాధలను మోయడానికి వారు సిద్ధంగా ఉండరు. మీ కలలను వారి ద్వారా నెరవేర్చుకోవాలని చూడటం వారి వ్యక్తిత్వాన్ని దెబ్బతీస్తుంది.
భావోద్వేగ భారం: తల్లిదండ్రులు తమ బాధలను పిల్లలకు చెప్పి ఊరట పొందాలని చూడటం తప్పు. సమస్యలను పరిష్కరించడానికి, మిమ్మల్ని ఓదార్చడానికి వారు డాక్టర్లు కాదు. మీ భావోద్వేగాలను మీరే నియంత్రించుకోవాలి. పిల్లలపై ఆ భారం వేస్తే వారు తమ చిన్నతనాన్ని కోల్పోతారు.
పెద్దల గాసిప్స్, రహస్యాలు: ఇతరుల గురించి చెడుగా మాట్లాడుకోవడం (Gossip) లేదా రహస్యాలు చర్చించుకోవడం వంటివి పిల్లల ముందు చేయకండి. పిల్లలు వీటికి త్వరగా అలవాటు పడి, ఇతరుల పట్ల చులకన భావాన్ని పెంచుకుంటారు. ఇది వారి వ్యక్తిత్వ వికాసానికి అడ్డంకిగా మారుతుంది.
కోపాన్ని పిల్లలపై చూపడం: ఆఫీసులోనో లేదా బయట కలిగిన చిరాకును, కోపాన్ని ఇంట్లో పిల్లలపై చూపకండి. పిల్లల మనసు స్పాంజి లాంటిది. మీరు ఏదైనా చెప్పాలనుకుంటే ప్రేమతో చెప్పండి. అరుపులు, కేకలు వారిని మీ నుంచి దూరం చేస్తాయి.