అక్షరటుడే, వెబ్డెస్క్: Children Missing | దేశ రాజధాని ఢిల్లీ (Delhi)లో అదృశ్యమవుతున్న వ్యక్తుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా చిన్నారులు, యువతులు ఎక్కువ సంఖ్యలో కనిపించకుండా పోతుండటంతో ప్రజల్లో భయం పెరుగుతోంది. 2026 సంవత్సరం ప్రారంభమైన కేవలం మొదటి 27 రోజుల్లోనే మొత్తం 807 మంది కనిపించకుండా పోయినట్లు పోలీస్ రికార్డులు (Police Records) వెల్లడిస్తున్నాయి.
అంటే సగటున ప్రతి రోజూ దాదాపు 27 మంది అదృశ్యమవుతున్నారన్న మాట. ఇందులో ఇప్పటివరకు పోలీసులు 235 మందిని మాత్రమే గుర్తించగలిగారు. మిగిలిన 572 మంది ఆచూకీ ఇంకా తెలియకపోవడం మరింత ఆందోళనకు గురిచేస్తోంది. కనుగొన్న వారి కంటే కనిపించని వారి సంఖ్య ఎక్కువగా ఉండటం పరిస్థితి తీవ్రతను స్పష్టంగా చూపిస్తోంది.
Children Missing | ఎలా మిస్ అవుతున్నారు..
ఈ గణాంకాల్లో చిన్నారుల పరిస్థితి మరింత దారుణంగా ఉంది. కేవలం 27 రోజుల వ్యవధిలోనే 191 మంది మైనర్లు కనిపించకుండా పోయినట్లు నమోదైంది. వారిలో 48 మందిని మాత్రమే పోలీసులు తిరిగి గుర్తించగలిగారు. మిగిలిన 137 మంది చిన్నారుల జాడ ఇప్పటికీ లభ్యం కాలేదు. వీరిలో 120 మంది బాలికలే ఉండటం మరింత కలవరపెడుతోంది. ఈ అదృశ్యాల వెనుక అక్రమ రవాణా (Illegal Trafficking) ముఠాల పాత్ర ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ముఖ్యంగా 12 నుంచి 18 సంవత్సరాల మధ్య వయస్సు గల కౌమార దశ పిల్లలే ఎక్కువగా కనిపించకుండా పోతున్నట్లు గుర్తించారు. ఈ వయస్సు వర్గానికి చెందినవారు 169 మంది మిస్సింగ్ కాగా, 0 నుంచి 12 ఏళ్లలోపు ఉన్న చిన్నారులు సుమారు 22 మంది అదృశ్యమయ్యారు.
ఢిల్లీలో అదృశ్యాల సమస్య కొత్తది కాదని గణాంకాలు చెబుతున్నాయి. 2016 నుంచి 2026 మధ్య కాలంలో ఢిల్లీలో మొత్తం 60,694 మంది చిన్నారులు కనిపించకుండా పోయినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. అందులో 53,763 మందిని పోలీసులు తిరిగి గుర్తించగలిగినప్పటికీ, వేల సంఖ్యలో కేసులు ఇంకా పరిష్కారం కాని పరిస్థితి కొనసాగుతోంది. ఈ పరిస్థితులు రాజధానిలో భద్రతపై తీవ్ర ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. నిపుణులు మాత్రం కుటుంబాల అవగాహన లోపం, సోషల్ మీడియా (Social Media) ప్రభావం, నగర జీవన శైలి మార్పులు, అక్రమ రవాణా ముఠాల చురుకుదనం వంటి అంశాలు కూడా ఈ అదృశ్యాల వెనుక ప్రధాన కారణాలుగా ఉండొచ్చని అభిప్రాయపడుతున్నారు. పోలీసులు ప్రత్యేక బృందాలను (Special Teams) ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపడుతున్నప్పటికీ, పెరుగుతున్న కేసుల సంఖ్య ప్రజల్లో ఆందోళనను మరింత పెంచుతోంది.