అక్షరటుడే, వెబ్‌డెస్క్: Chewing gum | సాధారణంగా బాగా జలుబు చేసినప్పుడు లేదా ఫ్లూ వచ్చినప్పుడు ఉపశమనం కోసం మనం వెంటనే ఓ మాత్ర వేసుకుంటాం. కానీ ఇకపైన ఆ చేదు మాత్రలతో పని ఉండకపోవచ్చు. ఎందుకంటే, జలుబు తగ్గడానికి మాత్రకు బదులుగా కేవలం ఒక చూయింగ్ గమ్‌ను నమిలితే చాలు.
అంతేకాదు, ఈ గమ్‌తో మీలోని వైరస్ ఇతరులకు కూడా వ్యాప్తి చెందకుండా అడ్డుకోవచ్చని అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా శాస్త్రవేత్తలు ప్రకటించారు. నోటిని తాజాగా ఉంచే ఒక సాధారణ చూయింగ్ గమ్‌కి ఈ అద్భుతమైన శక్తి ఎలా సాధ్యమైందో తెలుసుకుందాం.
Chewing gum | చిక్కుడు గింజల ప్రోటీన్:
ఈ కొత్త యాంటీ-వైరల్ చూయింగ్ గమ్ Chewing gum అభివృద్ధి వెనుక ఒక అద్భుతమైన శాస్త్రీయ రహస్యం ఉంది. దీని తయారీలో ‘ఫ్రిల్’ (FRIL) అనే ఒక ప్రత్యేకమైన ప్రోటీన్‌ను ఉపయోగించారు. ఈ శక్తివంతమైన ప్రోటీన్‌ను ఊదారంగులో ఉండే లాబ్లాబ్ (Lablab) అనే చిక్కుడుజాతి గింజల నుంచి తీస్తారు. ఈ లాబ్లాబ్ చిక్కుడుకాయలు మనదేశంలోని తమిళనాడులోనూ పండుతాయని శాస్త్రవేత్తలు గుర్తించారు.
Chewing gum | వైరస్‌ను అడ్డుకోవడం:
ఈ గమ్ పనిచేసే విధానం చాలా సులభం, కానీ దాని ఫలితాలు మాత్రం అద్భుతాలు సృష్టిస్తున్నాయి . మనం ఈ చూయింగ్ గమ్‌ని నమలడం మొదలుపెట్టినప్పుడు, అందులో ఉన్న ‘ఫ్రిల్’ ప్రొటీన్ మన లాలాజలంలోకి (ఉమ్మిలోకి) విడుదలవుతుంది. ఈ ప్రొటీన్ వెంటనే నోటిలోని సూక్ష్మమైన వైరస్ కణాలకి గట్టిగా అతుక్కుపోతుంది. అలా అతుక్కుపోయిన తర్వాత, ఆ వైరస్ కదలికలను పూర్తిగా అడ్డుకుంటుంది. దీనివల్ల జలుబుకు కారణమైన వైరస్ చనిపోతుంది.
మునుపటి మందులు కేవలం శరీరంలోని వైరస్‌ను చంపడానికి మాత్రమే ఉపయోగపడేవి. కానీ, ఈ యాంటీ వైరస్ చూయింగ్‌గమ్, వైరస్‌ను నోటిలోనే శక్తిని కోల్పోవడం ద్వారా అది మరొకరికి వ్యాపించకుండా కూడా అడ్డుకుంటుంది. ఇది అంటువ్యాధులను ఎదుర్కోవడంలో నిజమైన ‘గేమ్-ఛేంజర్’ అవుతుందని నిపుణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.