అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Chevella Accident | చేవెళ్ల బస్సు ప్రమాదంలో మృతుల సంఖ్య 24కి చేరింది. ఈ ఘటనలో మరో 40 మంది గాయపడగా.. మరో 20 మంది పరిస్థితి విషమంగా ఉంది. కాగా ప్రమాద స్థలికి వెళ్లిన చేవేళ్ల ఎమ్మెల్యే (Chevella MLA) కాలే యాదయ్యకు నిరసన సెగ తగిలింది.
రంగారెడ్డి జిల్లా (Rangareddy District) చేవేళ్ల మండలం మీర్జాగూడ సమీపంలో సోమవారం ఘోర ప్రమాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఆర్టీసీ బస్సు (RTC Bus)ను కంకర లోడ్‌తో వెళ్తున్న లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో మొదట 17 మంది మృతి చెందారు. ప్రమాద తీవ్రత అధికంగా ఉండంతో మృతుల సంఖ్య పెరుగుతోంది. ప్రయాణికులు కంకరలో కూరుకుపోవడంతో ఎక్కువ మంది చనిపోయారు. ఇప్పటి వరకు 24 మంది చనిపోయారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. చేవెళ్ల ఆస్పత్రిలో 10 మందికి వైద్యం చేస్తున్నారు. పరిస్థితి విషమంగా ఉన్నవారిని నిమ్స్, గాంధీ ఆస్పత్రులకు తరలించారు.
Chevella Accident | ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు
మృతుల్లో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఉన్నారు. తాండూరు (Tandoor) వడ్డెర కాలనీకి చెందిన తనుషా, సాయి ప్రియ, నందిని ప్రమాదంలో చనిపోయారు. మరో తల్లి బిడ్డ సైతం మరణించారు. దీంతో ఆయా కుటుంబాల్లో తీరని విషాదం నెలకొంది.
Chevella Accident | ఎమ్మెల్యేపై ఆగ్రహం
ప్రమాదం విషయం తెలియగానే చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య ఘటన స్థలానికి చేరుకున్నారు. అయితే ఆయనను స్థానికులు అడ్డుకున్నారు. కొన్నేళ్లుగా రోడ్డు వెడల్పు చేయాలని డిమాండ్ చేస్తున్న పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేవారు. ఎమ్మెల్యే డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. నిత్యం ఈ మార్గంలో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో పోలీసులు ఎమ్మెల్యేను అక్కడి నుంచి పంపించి వేశారు.
