అక్షరటుడే, వెబ్డెస్క్ : Chevella Bus Accident | రంగారెడ్డి జిల్లా (Rangareddy District) చేవెళ్ల సమీపంలో చోటుచేసుకున్న ఘోర బస్సు ప్రమాదం తీవ్ర విషాదం నింపింది. సోమవారం (నవంబర్ 3) ఉదయం 7 గంటల సమయంలో తాండూరు నుంచి హైదరాబాద్ (Hyderabad) వస్తున్న ఆర్టీసీ బస్సును కంకరతో నిండిన టిప్పర్ లారీ ఢీకొట్టింది.
ఈ తీవ్రతకు లారీపై ఉన్న కంకర బస్సు లోపల పడిపోవడంతో పలువురు ప్రయాణికులు అక్కడికక్కడే మృతిచెందారు. ఈ ప్రమాదంలో టిప్పర్, బస్సు డ్రైవర్‌లతో కలిపి మొత్తం 19 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 24 మంది గాయపడి వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ప్రమాద సమయంలో బస్సులో 70 మంది ఉన్నారు. వారిలో 17 మంది మాత్రమే సురక్షితంగా బయటపడ్డారు.
Chevella Bus Accident | చివరి నిమిషంలో..
ఈ ప్రమాదంలో తాండూరుకు (Thandur) చెందిన అబ్దుల్ మాజీద్ కుటుంబం తీవ్ర విషాదాన్ని ఎదుర్కొంది. అనారోగ్యంతో ఉన్న భార్యను మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ ఆసుపత్రికి (Hyderabad Hospital) తీసుకెళ్తూ మాజీద్ తన ముగ్గురు పిల్లలతో బస్సులో ప్రయాణిస్తున్నాడు. మాజీద్ భార్య, ఐదేళ్ల చిన్న కొడుకు డ్రైవర్ వెనుక సీటులో కూర్చుండగా, మాజీద్ తన మరో ఇద్దరు పిల్లలతో వెనుక సీట్లో కూర్చున్నాడు. అయితే ప్రమాదానికి కేవలం ఒక నిమిషం ముందు ఐదేళ్ల బాలుడు ఎవరో పిలిచినట్లుగా లేచి తండ్రి వద్దకు వచ్చి వెనుక సీటులో కూర్చున్నాడు. ఆ క్షణంలో ప్లేస్ మారడం అతడి ప్రాణాలను కాపాడింది. ఆ బాలుడు సీటు మారిన నిమిషం తర్వాతే లారీ బస్సును ఢీకొట్టగా, ముందుభాగంలో కూర్చున్న మాజీద్ భార్య అక్కడికక్కడే మృతి చెందింది. కానీ చిన్నారి, మాజీద్, మిగిలిన ఇద్దరు పిల్లలు స్వల్ప గాయాలతో బయటపడ్డారు.
ఒక్క నిమిషం తేడాతో తల్లి ప్రాణాలు కోల్పోయినా, చిన్నారి బతికిపోయాడు. ఈ సంఘటనను విన్నవారంతా ఆ చిన్నారి అదృష్టంపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. చేవెళ్ల బస్సు ప్రమాదం రాష్ట్ర చరిత్రలోనే అతి పెద్ద రోడ్డు దుర్ఘటనల్లో ఒకటిగా నిలిచింది. బస్సు డ్రైవర్ కూడా చాలా స్పీడ్‌లో ఉన్నాడని, చాలా సార్లు భయాందోళనకు గురిచెందామని అందులో ఉన్న ప్రయాణికులు చెప్పుకొచ్చారు.
