అక్షరటుడే, వెబ్‌డెస్క్ : RBI | బ్యాంకింగ్ వ్యవస్థలో అనేక డిజిటల్ చెల్లింపుల మార్గాలు అందుబాటులోకి వచ్చినా, పెద్ద మొత్తాల లావాదేవీలకు ఇప్పటికీ చెక్కులు ప్రధాన సాధనంగా ఉన్నాయి.
అయితే, చెక్కు వేసిన తర్వాత నగదు ఖాతాలో జమయ్యే వరకు దాదాపు 2 నుండి 4 రోజులు పడుతున్నాయి. దీనివల్ల వినియోగదారులు పెద్ద ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (Reserve Bank of India) చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంది.
RBI | చెక్కులు వేసిన రోజే నగదు చెల్లింపు
ఆర్బీఐ తీసుకొచ్చిన కొత్త విధానం ప్రకారం, చెక్కు క్లియరెన్స్(Cheque Clearance) ఇప్పుడు రియల్ టైమ్‌లో జరగనుంది. అంటే, ఒకవేళ మీరు ఉదయం చెక్కును బ్యాంకులో జమ చేస్తే, అదే రోజులో మీ ఖాతాలోకి సొమ్ము జమ కావచ్చు. ఈ మార్పు 2025 అక్టోబరు 4వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా అమలులోకి రానుంది. ఇది చెక్కుల క్లియరెన్స్‌లో మైలురాయిగా భావిస్తున్నారు. కొత్త విధానం ఎలా పనిచేస్తుంది? అంటే ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు చెక్కులు బ్యాంకులో జమ చేస్తే, అవి వెంటనే స్కాన్ చేసి సెంట్రల్ క్లియరింగ్ హౌస్ (CCH) కు పంపిస్తారు.అక్కడినుంచి చెక్కు స్కాన్ డేటాను సంబంధిత బ్యాంకుకు పంపిస్తారు. సంబంధిత బ్యాంకు రాత్రి 7 గంటల లోపు ఆ చెక్కును పరిశీలించి, నగదు జమ చేయాలి.
ఒకవేళ సమయానికి బ్యాంకు స్పందించకపోతే, ఆ చెక్కును స్వీకరించినట్లుగా భావించి తదుపరి ప్రక్రియ కొనసాగుతుంది.ఉదయం 11 నుంచి రాత్రి 7 గంటల వరకు ప్రతి గంటకు చెక్కుల క్లియరెన్స్‌పై ప్రత్యేకంగా పరిశీలన జరుగుతుంది.చెక్కు క్లియరెన్స్ పూర్తయిన గంటలోపే ఖాతాదారుడి అకౌంట్‌లో నగదు జమ చేయాల్సి ఉంటుంది. అమలులో రెండు దశలు ఉంటాయి. ప్రథమ దశ: అక్టోబరు 4 నుంచి జనవరి 2 వరకు ఉదయం 11 నుంచి రాత్రి 7 గంటల వరకు క్లియరెన్స్ చేయాలి. ద్వితీయ దశ: జనవరి 3 నుంచి ..కేవలం 3 గంటల వ్యవధిలోనే చెక్కులు పరిశీలించి క్లియర్ చేయాలి. ఇకపై చెక్కులు వాడే వినియోగదారులు వేచి చూడాల్సిన అవసరం లేదు. చెక్కు వేసిన రోజే నగదు వారి ఖాతాలోకి చేరనుండటంతో, ఆర్థిక లావాదేవీలు మరింత వేగంగా, పారదర్శకంగా మారనున్నాయి. RBI తీసుకొచ్చిన ఈ కొత్త నిర్ణయం ద్వారా బ్యాంకింగ్ రంగంలో పెద్ద మార్పుకు నాంది పలికినట్టే