అక్షరటుడే, వెబ్‌డెస్క్ : KCR | బీఆర్ఎస్ అధినేత, రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ అజ్ఞాతం వీడడం లేదు. ప్రజలు తీవ్ర ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతున్నా, పార్టీలో, సొంతింట్లో తీవ్ర సంక్షోభం నెలకొన్నా పెదవి విప్పడం లేదు. ఫామ్‌హౌస్ గడప దాటి బయటకు రావడం లేదు.
మేడిగడ్డ కుంగినా, పదేళ్ల అవినీతిపై కేసులు పెట్టినా, కవితను అరెస్టు చేసినా, తనతో పాటు కేటీఆర్(KTR) విచారణను ఎదుర్కొంటున్నా, బీజేపీలో బీఆర్ఎస్ విలీనంపై ప్రచారం జరిగినా, కవిత ఎదురుతిరిగినా.. ఏనాడూ అడుగు బయటపెట్టలేదు. జనం ముందుకొచ్చి సమాధానం చెప్పలేదు.
ఎప్పుడైతే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ(BRS Party) ఓడిపోయిందో అప్పటి నుంచి ఆయన ప్రజా జీవితానికి దూరమయ్యారు. ఎర్రవల్లిలోని ఫామ్‌హౌస్‌కే పరిమితమయ్యారు. చివరకు అసెంబ్లీ సమావేశాలకు సైతం దూరంగా ఉన్నారు. ఎంతో కీలకమైన బిల్లులతో పాటు తానే ఇంజినీర్‌గా మారి నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు అంశంపై ప్రత్యేకంగా జరిగిన అసెంబ్లీ సమావేశాలకు(Assembly Meetings) కూడా హాజరు కాలేదు. ఇక, కవిత ఎపిసోడ్ బీఆర్ఎస్ పార్టీలో కల్లోలం రేపిన తరుణంలోనూ ఆయన బయటకు రాలేదు. పార్టీలో తీవ్ర గందరగోళం నెలకొన్నా, తన సొంతింట్లోనే సంక్షోభం ఏర్పడినా కాలు బయట పెట్టలేదు. ఈ నేపథ్యంలో కేసీఆర్(KCR) వైఖరి అనేక విమర్శలకు తావిస్తోంది.
KCR | పేరుకే ప్రతిపక్ష నేత
అసెంబ్లీ ఎన్నికల్లో(Assembly Elections) బీఆర్ఎస్ ఓటమి మూటగట్టుకుంది. కనుమరుగు అయిందని అనుకున్న కాంగ్రెస్ అనూహ్యంగా పుంజుకుని గద్దెనెక్కింది. పదేళ్ల పాలనలో ఎమ్మెల్యేలు, గులాబీ నేతలు చేసిన అరాచకం, ముఖ్యమంత్రి పట్టించుకోక పోవడమే బీఆర్ ఎస్ ఓటమికి ప్రధాన కారణం. ఉద్యమ పార్టీని గద్దె దించిన ప్రజలు ప్రతిపక్ష హోదా కట్టబెట్టారు. ప్రతిపక్ష నేతగా ప్రజా సమస్యలపై గొంతెత్తాల్సిన కేసీఆర్ ఓటమి తర్వాత ఏ ఒక్కనాడు జనం ముందుకు వచ్చిందీ లేదు. పాలనా వైఫల్యాలపై పోరాటం చేసిందీ లేదు. ప్రభుత్వాన్ని ప్రశ్నించిందీ లేదు. గత 20 నెలల కాలంలో కేసీఆర్ జనం మధ్యకు వచ్చింది ఒకటి, రెండుసార్లు మాత్రమే. సాగునీటి సమస్యలపై నల్లగొండ జిల్లాలో ఒకసారి పర్యటించారు. బీఆర్ఎస్ పార్టీ పాతికేళ్ల ప్రస్థానం పూర్తయిన సందర్భంగా నిర్వహించిన రజతోత్సవ సభకు మరోసారి బయటకు వచ్చారు. ఇక, పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా పార్టీ అభ్యర్థుల తరఫున ప్రచారం చేశారు. ఓ టీవీ చానల్ ఇంటర్వ్యూ పేరిట ఒకసారి బయట కనిపించారు. తప్పితే కేసీఆర్ ఫామ్‌హౌస్(Farm House)ను వీడి బయటకు రాలేదు. కనీసం మీడియా ముందుకైనా రాలేదు. అనారోగ్యంతో బాధ పడుతున్న గులాబీ బాస్ ఒకటి, రెండుసార్లు ఆస్పత్రిలో చేరిన సమయంలో, కాళేశ్వరం అక్రమాలపై విచారణ జరిపిన పీసీ ఘోష్ కమిషన్ ఎదుట విచారణకు హాజరైన సమయంలోనే కనిపించారు తప్పితే ఆయన పెద్దగా బయట కనిపించింది కూడా లేదు.
KCR | అసెంబ్లీ సమావేశాలకూ డుమ్మా
ప్రతిపక్ష నాయకుడిగా అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావాల్సిన కేసీఆర్ ఏ ఒక్కనాడు హాజరు కాలేదు. ప్రజా సమస్యలపై ప్రశ్నించేందుకు, ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపేందుకు అసెంబ్లీని చక్కని వేదిక. కానీ ఏ ఒక్కనాడు కూడా కేసీఆర్ సభకు వచ్చిందీ లేదు. సమస్యలను ప్రస్తావించిందీ లేదు. బిల్లులపై చర్చల్లో పాల్గొన్నదీ లేదు. ఈ 20 నెలల కాలంలో ఆయన అసెంబ్లీకి వచ్చింది రెండుసార్లు మాత్రమే. శాసన సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేయడానికి ఒకసారి వచ్చారు. తరచూ సమావేశాలకు హాజరు కాకుంటే పదవీ నుంచి తొలగించే అవకాశముండడంతో మరొసారి మాత్రమే ఆయన అసెంబ్లీకి వచ్చారు తప్పితే మళ్లీ శాసనసభ ముఖం చూడలేదు. కీలకమైన బడ్జెట్ సమావేశాలకు తోడు కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project)పై పీసీ ఘోష్ నివేదికపై చర్చించేందుకు జరిగిన సమావేశాలకు సైతం ఆయన డుమ్మా కొట్టారు. ప్రభుత్వం తననే టార్గెట్‌గా చేసి కాళేశ్వరంపై రచ్చ చేస్తున్న సమయంలో సమాధానం చెప్పుకోవాల్సిన కేసీఆర్ అప్పుడు కూడా బయటకు రాలేదు.
KCR | సొంతింట్లో సంక్షోభం..
వరుస ఓటములతో బీఆర్ఎస్ డీలా పడిన తరుణంలో అధినేత బిడ్డ, ఎమ్మెల్సీ కవిత(MLC Kvitha) ఎపిసోడ్ పార్టీలో తీవ్ర కల్లోలం సృష్టించింది. గులాబీ శ్రేణుల్లో కలకలం రేపింది. పార్టీపై సొంత కూతురే ధిక్కార స్వరం వినిపించడం, కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని చెప్పడం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. కేసీఆర్ వైఖరినే ప్రశ్నించేలా కవిత సంధించిన లేఖ బయటకు రావడం, ఆ తర్వాత ఆమె చేసిన వ్యాఖ్యలు ఉద్యమ పార్టీలో పెను సంక్షోభం సృష్టించాయి. కేటీఆర్, హరీశ్‌రావు(Harish Rao), సంతోష్‌రావు(Santosh Rao)లపై చేసిన ఆరోపణలు కల్వకుంట్ల కుటుంబంలో చిచ్చు రేపాయి. ఈ నేపథ్యంలో నేతలు, కార్యకర్తలు గందరగోళంలో పడిపోయిన తరుణంలోనూ కేసీఆర్ బయటకు రాలేదు. వారికి భరోసా ఇచ్చే ప్రయత్నమూ చేయలేదు. అంతెందుకు మద్యం కుంభకోణం కేసులో కవితను సీబీఐ అరెస్టు చేసిన తరుణంలోనూ కేసీఆర్ బయటకు రాలేదు. ఇక ప్రజల కోసం, ప్రజా సంక్షేమం కోసం ఆయన ఎందుకు వస్తారన్న వాదన వినిపిస్తోంది.
KCR | ముందే చెప్పిన కేసీఆర్…
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 20 నెలల వ్యవధిలో ప్రజలకు ఎన్నో కష్టాలు వచ్చాయి. ఆకస్మిక వరదలతో ప్రజలు అల్లాడిపోగా, యూరియా కొరతతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సమస్యల పరిష్కారం కోసం ఉద్యోగులు, ఉపాధ్యాయులు రోజూ ధర్నాలు నిర్వహిస్తున్నారు. ఫ్రీ బస్ పథకమేమో కానీ మహిళలు తన్నుకుంటున్నారు. ఇలాంటి తరుణంలో ప్రజా సమస్యలపై, ప్రభుత్వ వైఫల్యాలపై పోరాడాల్సిన ప్రధాన ప్రతిపక్ష నేత అజ్ఞాత వాసం వీడక పోవడంపై విమర్శలు వెత్తుతున్నాయి. అయితే కేసీఆర్ గతంలో చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా కొందరు విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు. తనను గెలిపిస్తే పని చేస్తానని, లేకపోతే ఫామ్‌హౌస్‌లో రెస్ట్ తీసుకుంటానని గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కేసీఆర్ పలుమార్లు చెప్పిన విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. ఏదేమైనప్పటికీ నాలుగు కోట్ల ప్రజల కోసం, నమ్ముకున్న లక్షలాది మంది కార్యకర్తల కోసం కేసీఆర్ ప్రతిపక్ష నేతగా పోరాడాల్సిన అవసరముందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.