అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Family Benefit Card | ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం నూతన పథకాల అమలుకు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి ప్రత్యేకంగా ‘ఫ్యామిలీ బెనిఫిట్ కార్డ్’(Family Benefit Card) జారీ చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. గురువారం రాష్ట్ర సచివాలయంలో నిర్వహించిన ఫ్యామిలీ బెనిఫిట్ మానిటరింగ్ వ్యవస్థ సమీక్ష సందర్భంగా ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ కార్డు ఆధార్ కార్డు తరహాలో ఉండనుంది. రాష్ట్రంలోని కుటుంబాలకు సంబంధించిన అన్ని సంక్షేమ పథకాలు, లబ్ధిదారుల వివరాలు, అవసరాలపై సమాచారం ఈ కార్డ్‌లో పొందుపరచనున్నారు.
Family Benefit Card | పాపులేషన్ పాలసీ కూడా త్వరలోనే..
ప్రభుత్వం అందించే పథకాలను వేగంగా, నేరుగా అవసరమైన వారికి చేర్చడం లక్ష్యంగా ఈ వ్యవస్థను రూపొందించనున్నారు. ప్రతి కుటుంబానికి ఏ అవసరాలు ఉన్నాయో తెలుసుకోవాలి. అందుకోసం క్షేత్రస్థాయిలో సేకరించిన సమాచారం చాలా కీలకం. అవసరమైతే, ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాలను రీ-డిజైన్ చేయడానికీ సిద్ధంగా ఉండాలి. పథకాల వల్ల కుటుంబాలు విడిపోవడం వంటి పరిణామాలు ఎదురుకాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి అని సీఎం చంద్రబాబు(CM Chandra Babu) అధికారులను ఆదేశించారు.
సమీక్షలో మరో కీలక అంశంగా పాపులేషన్ పాలసీపై చర్చ జరిగింది. రాష్ట్ర అవసరాలను దృష్టిలో ఉంచుకుని త్వరలోనే ప్రత్యేక జనాభా విధానాన్ని ప్రకటించాల్సిందిగా సీఎం సూచించారు. రాష్ట్రానికి మేలు చేసేలా, సమాజాన్ని సమగ్రంగా అభివృద్ధి చేసేలా సంక్షేమ విధానాలు అమలయ్యేలా చర్యలు చేపట్టాలన్నారు. ఈ ఫ్యామిలీ కార్డ్‌తో ఏం లాభం అనేది చూస్తే.. ఒక్క కార్డు ద్వారా కుటుంబ సభ్యుల వివరాలు, ఆదాయం, పథకాల లబ్ధి సమాచారం లభ్యం అవుతుంది. ప్రభుత్వం అమలు చేసే పథకాలు నేరుగా అవసరమైనవారికి చేరే అవకాశం ఉంటుంది. పథకాల పునః సమీక్ష, అవసరమైతే మార్పులు చేసేందుకు అనుకూలంగా ఉంటుంది. ఈ చర్యలతో సంక్షేమ పరంగా సమర్థత, పారదర్శకత, వేగం పెరిగే అవకాశం ఉంది. రాష్ట్రంలో డిజిటల్ గవర్నెన్స్(Digital Governance)కి ఇది ఒక కీలక అడుగు కావొచ్చని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి.