అక్షరటుడే, వెబ్‌డెస్క్ : CM Chandrababu | ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chief Minister Chandrababu Naidu) అనకాపల్లి జిల్లా పర్యటన సందర్భంగా ఓ అనూహ్య ఘటన చోటుచేసుకుంది. ముఖ్యమంత్రి కాన్వాయ్‌లో (Chief Minister’s convoy) వైసీపీ జెండా రంగులు, ఆ పార్టీ మాజీ ఎంపీ ఫొటో ఉన్న అంబులెన్స్‌లు దర్శనమివ్వడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ప్రయాణిస్తున్న కాన్వాయ్‌లో ప్రత్యర్థి పార్టీకి చెందిన గుర్తులు ఉండడంతో అధికారులు వ్యవహరించిన తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వివరాల్లోకి వెళ్తే.. సీఎం చంద్రబాబు నాయుడు కశింకోట మండలం తాళ్లపాలెంలో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్ నుంచి బంగారయ్యపేటలోని సభా ప్రాంగణానికి వెళ్లే సమయంలో ఆయన కాన్వాయ్‌లో రెండు అంబులెన్స్‌లు ఉన్నాయి.
CM Chandrababu | ఏం జరిగింది…
అయితే వాటిపై గత వైసీపీ YCP ప్రభుత్వ హయాంలో ఎంపీగా పనిచేసిన బి.సత్యవతి ఫొటోతో పాటు వైసీపీ పార్టీ రంగులు స్పష్టంగా కనిపించాయి. ఈ దృశ్యాలు అక్కడున్నవారిని ఆశ్చర్యానికి గురిచేయడమే కాక, రాజకీయంగా పెద్ద దుమారం రేపాయి. ఈ ఘటనపై ప్రతిపక్షాలు, సామాజిక మాధ్యమాల్లో (social media) నెటిజన్లు అధికారుల నిర్లక్ష్యాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లు అత్యంత జాగ్రత్తగా చేయాల్సి ఉండగా.. కనీస ప్రొటోకాల్ కూడా పాటించలేదని విమర్శలు వినిపిస్తున్నాయి.
వివాదం చెలరేగడంతో జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి హైమావతి (Hymavathi) స్పందించారు. గతంలో ఎంపీ నిధులతో ఈ అంబులెన్స్‌లను కొనుగోలు చేశామని, అందువల్ల వాటిపై ఉన్న ఫొటోలు, రంగులు మార్చలేదని ఆమె వివరణ ఇచ్చారు. ముఖ్యమంత్రి పర్యటనకు మొత్తం నాలుగు అంబులెన్స్‌లు అవసరం కాగా.. అందుబాటులో ఉన్నవాటినే వినియోగించామని తెలిపారు. అయితే, సీఎం కాన్వాయ్‌లో వినియోగించే ముందు కనీసం ఆ ఫొటోలు, పార్టీ రంగులు కనిపించకుండా కప్పివేయాల్సిన బాధ్యత అధికారులదేనని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ ఘటన అధికార యంత్రాంగంలో సమన్వయ లోపం, నిర్లక్ష్యాన్ని స్పష్టంగా చూపుతోందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.