అక్షరటుడే, వెబ్‌డెస్క్ : ADR Report | ముఖ్యమంత్రులుగా పని చేస్తున్న వారిలో అత్యంత సంపన్నుడిగా ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ నారా చంద్రబాబు నాయుడు తొలి స్థానంలో నిలిచారు. ఆయన తర్వాత అరుణాచల్ ప్రదేశ్ సీఎం ఫెమా ఖండు రెండో స్థానాన్ని ఆక్రమించారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ (West Bengal CM Mamata Banerjee) ఈ జాబితాలో అట్టడుగున ఉన్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల కంటే తక్కువ ఆస్తులు కలిగి ఉన్నారని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ADR) తాజా నివేదిక (ADR Report) తెలిపింది. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రులు దాఖలు చేసిన అఫిడవిట్లు, డిసెంబర్ 2024 తర్వాత జరిగిన ఉప ఎన్నికల ఆధారంగా ఈ నివేదికను రూపొందించింది.
ADR Report | చంద్రబాబుకు రూ.931 కోట్ల ఆస్తులు..
ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు (Andhra Pradesh CM Chandrababu) అత్యంత సంపన్న ముఖ్యమంత్రిగా జాబితాలో మొదటి స్థానాన్ని నిలుపుకున్నారు. ఆయన ఆస్తుల విలువ రూ.931 కోట్లకు పైగా ఉంది. అరుణాచల్ ప్రదేశ్‌కు చెందిన పెమా ఖండు రూ.332 కోట్ల ఆస్తులతో రెండో స్థానంలో ఉన్నారు. దేశంలోని 31 మంది ముఖ్యమంత్రులలో ఈ ఇద్దరు నాయకులు మాత్రమే బిలియనీర్లుగా ఉన్నారని నివేదిక తెలిపింది. మొత్తం 31 మంది ముఖ్యమంత్రుల మొత్తం సంపద దాదాపు రూ.1,630 కోట్లుగా ఉందని ఏడీఆర్ లెక్క గట్టింది.
ADR Report | పేద సీఎం మమత
2021 సెప్టెంబర్లో భవానిపూర్ ఉప ఎన్నికకు ముందు దాఖలు చేసిన అఫిడవిట్ ప్రకారం.. మమత బెనర్జీకి అతి తక్కువ ఆస్తులున్నాయి. చేతిలో రూ. 69,255 నగదు, రూ. 13.5 లక్షల బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్నాయని వెల్లడైంది. ఇందులో ఆమె ఎన్నికల ఖర్చు ఖాతాలో రూ. 1.5 లక్షలు కూడా ఉన్నాయి. 43,837 విలువైన 9 గ్రాముల ఆభరణాలను కూడా ఆమె అఫిడవిట్లో పేర్కొన్నారు. అయితే తన పేరు మీద ఉన్న ఆస్తి లేదా నివాస గృహం గురించి ప్రస్తావించలేదు. మమత ప్రకటించిన ఆస్తులు కాలక్రమేణా తగ్గాయి. 2020–21లో ఆమె ఆదాయపు పన్ను రిటర్న్‌ల ప్రకారం మమత సంపద రూ. 15.4 లక్షలుగా నమోదైంది. అంతకంటే ముందు 2016 అసెంబ్లీ ఎన్నికల సమయంలో, ఆమె ఆస్తులు రూ. 30.4 లక్షలుగా ఉన్నాయి. మరోవైపు, జమ్మూ కశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లాకు రూ.55 లక్షల ఆస్తులు ఉండగా, కేరళ సీఎం పినరయి విజయన్ రూ. కోటి కంటే కొంచెం ఎక్కువ ఆస్తులతో కింది నుంచి మూడో స్థానంలో ఉన్నారు.