అక్షరటుడే, వెబ్‌డెస్క్ : CM Chandrababu | క్యాబినెట్ సమావేశం (Cabinet Meeting) అనంతరం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు టీడీపీ మంత్రులతో విడివిడిగా సమావేశమై కీలక సూచనలు చేశారు. ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న అంచనాలకు అనుగుణంగా మరింత చురుగ్గా పని చేయాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు.
సమస్యల పరిష్కారంలో జాప్యం లేకుండా స్పందించాలని, ప్రజల నుంచి వస్తున్న వినతులు తగ్గేలా వ్యవస్థను బలోపేతం చేయాలని మంత్రులకు దిశానిర్దేశం చేశారు. ప్రస్తుతం తానే నెలకు రెండు, మూడు సార్లు పార్టీ కార్యాలయానికి వెళ్లి ఫిర్యాదులు స్వీకరించాల్సి వస్తోందని చంద్రబాబు వ్యాఖ్యానించారు.
CM Chandrababu | చంద్రబాబు సీరియస్..
పార్టీ కోసం ఐదేళ్ల పాటు కష్టపడ్డ కార్యకర్తల వివరాలు ఇవ్వాలని పలుమార్లు కోరినా ఆశించిన స్థాయిలో స్పందన లేదని సీఎం చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్లమెంటు స్థాయి కమిటీల ఏర్పాటులో కూడా తానే ముందుండి పూర్తి చేయాల్సి వచ్చిందని పేర్కొన్నారు. దీనివల్ల జిల్లా స్థాయి నాయకత్వం, మంత్రుల పనితీరు ఎలా ఉందో అర్థమవుతోందని అన్నారు. ఇదే సమయంలో మంత్రి నారా లోకేష్ (Minister Nara Lokesh) కూడా మంత్రులతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. టీడీపీ సంస్కృతి బెదిరింపులు, దౌర్జన్యాలపై ఆధారపడదని, ప్రజలకు సేవ చేయడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. సంక్షేమ పథకాలు అమలు చేస్తూనే అభివృద్ధిని వేగవంతం చేస్తున్నామని, అయినప్పటికీ వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. ఆ ప్రచారాన్ని సమర్థంగా ఎదుర్కొనేలా జిల్లా నాయకత్వం సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ప్రజావేదికల వద్ద వచ్చే ఫిర్యాదులు సకాలంలో పరిష్కారమయ్యేలా వ్యవస్థను మరింత పటిష్టం చేయాలని హితవు పలికారు.
అంతకుముందు రాష్ట్ర స్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు సమావేశంలో సీఎం చంద్రబాబు మంత్రులు, అధికారుల పనితీరును ప్రశంసించారు. గత ఏడాది ఐక్యతతో పనిచేసి పెట్టుబడులు ఆకర్షించడంలో ప్రభుత్వం విజయం సాధించిందని, ఇదే ఉత్సాహం కొనసాగించాలని కోరారు. గత పాలనలో ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) బ్రాండ్ తీవ్రంగా దెబ్బతిందని, దాన్ని తిరిగి నిలబెట్టేందుకు రెండేళ్లు శ్రమించాల్సి వచ్చిందని గుర్తు చేశారు. ప్రస్తుతం అంతర్జాతీయ స్థాయి సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడులకు ముందుకు రావడం ప్రభుత్వ విధానాలపై నమ్మకానికి నిదర్శనమని చెప్పారు. అభివృద్ధి కార్యక్రమాలతో పాటు సంక్షేమ పాలనను సమతుల్యంగా ముందుకు తీసుకెళ్లడంలో టీమ్‌వర్క్ బాగా పనిచేస్తోందని సీఎం ప్రశంసించారు. పథకాల అమలు నిరంతరంగా కొనసాగుతూనే, విద్యుత్ ఛార్జీల భారం తగ్గించడం వంటి ప్రజాప్రయోజన నిర్ణయాలు ప్రభుత్వం తీసుకున్నదని ఆయన పేర్కొన్నారు. మొత్తంగా ప్రజాసేవ, అభివృద్ధి రెండింట్లోనూ (greatandhra) మరింత వేగం పెంచాలనే సంకల్పంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని ఈ సమావేశాలు స్పష్టం చేశాయి.