అక్షరటుడే, వెబ్‌డెస్క్ : RTC Promotions | వినాయక చవితి (Vinayaka Chaviti) సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (APS RTC) ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న పదోన్నతులు చేపట్టడానికి ఆమోదం తెలిపింది.
సీఎం చంద్రబాబు నాయుడు (CM Chandrababu) ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. ఈ నిర్ణయంతో ఆర్టీసీలో అర్హులైన దాదాపు 3,000 మంది ఉద్యోగులకు పదోన్నతులు లభించనున్నాయి. వీరిలో డ్రైవర్లు, కండక్టర్లు, గ్యారేజీ కార్మికులు, సూపర్‌వైజర్లు వంటి విభాగాల ఉద్యోగులు ఉన్నారు.
RTC Promotions | ప్రభుత్వంలో విలీనం చేసినా..
వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్టీసీని (RTC) ప్రభుత్వంలో విలీనం చేసినప్పటికీ, వివిధ కారణాలతో పదోన్నతులు అనుమతించకపోవడం ఉద్యోగుల్లో అసంతృప్తికి దారితీసింది. దీంతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక..ఆర్టీసీ ఉద్యోగులు పదోన్నతుల కోసం పోరాటం చేశారు. ఈ క్రమంలో ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు ఉద్యోగుల విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకొని, సంబంధిత ఫైల్‌ను ప్రభుత్వానికి పంపించారు. సీఎం చంద్రబాబు అనుకూలంగా స్పందించడంతో చివరకు పదోన్నతులకు గ్రీన్ సిగ్నల్ లభించింది. ఈ నేపథ్యంలో ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు దామోదరరావు, జీవీ నరసయ్యలు మాట్లాడుతూ..ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న పదోన్నతులు ఇవాళ నెరవేరాయన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు, రవాణాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
RTC Promotions | ఉద్యోగుల హర్షం
ఈ నిర్ణయం ద్వారా కేవలం ఉద్యోగుల అభివృద్ధి కాకుండా, సంస్థలో ప్రేరణ, సమర్థత కూడా పెరిగే అవకాశం ఉంది. రవాణాశాఖలో నిర్వహణ పరంగా మెరుగుదల, ఉద్యోగుల నిబద్ధత, సామర్థ్యం పెరగాలన్న ప్రభుత్వ సంకల్పానికి ఇది కీలకంగా నిలుస్తుంది. మొత్తానికి, ఏపీఎస్ ఆర్టీసీ ఉద్యోగులు ఎన్నో సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న పదోన్నతుల సమస్యకు ప్రభుత్వం దిశానిర్దేశం చేస్తూ, ఉద్యోగుల్లో నూతనోత్సాహం నింపింది.
కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని ఈ నెల 15న నుంచి అమలు చేసిన సంగతి తెలిసిందే. ‘స్త్రీ శక్తి’ పేరుతో ఈ పథకం ప్రారంభం కాగా, పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్, సిటీ ఆర్డినరీ, మెట్రో బస్సుల్లో మహిళలు రాష్ట్రమంతటా ప్రయాణం చేసే అవకాశం ఉంది.