అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Traffic Challans | తెలంగాణలో ట్రాఫిక్ నిబంధనలు (Traffic Regulations) ఉల్లంఘించిన వారికి ప్రభుత్వం తరచుగా రాయితీలు ప్రకటించడం చూస్తూనే ఉన్నాం. పేరుకుపోయిన బకాయిలను రికవరీ చేసుకోవడమే లక్ష్యంగా 75% నుంచి 25% వరకు డిస్కౌంట్లు ఇస్తూ వస్తోంది.
అయితే ఈ విధానంపై హైకోర్టు (High Court) తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. రాయితీలు ఇవ్వడం వలన చట్టపరమైన భయం, గౌరవం ప్రజల్లో తగ్గిపోతుందని కోర్టు వ్యాఖ్యానించింది. ఫలితంగా ట్రాఫిక్ క్రమశిక్షణ క్షీణించే ప్రమాదం ఉందని న్యాయస్థానం స్పష్టం చేసింది.
Traffic Challans | ఈ–చలానా వ్యవస్థలో అత్యవసర మార్పులు అవసరం: హైకోర్టు
జస్టిస్ ఎన్.వి. శ్రవణ్‌కుమార్ విచారణ చేపట్టిన కేసులో, ఈ–చలానా (E Challan) వ్యవస్థలో చట్టపరమైన విభాగాలను స్పష్టంగా పొందుపరచడానికి అవసరమైన సాంకేతిక మార్పులు తప్పనిసరిగా చేయాలని ప్రభుత్వంకు ఆదేశించింది. ప్రత్యేకంగా ఉల్లంఘన జరిగినప్పుడు అది ఏ చట్టంలోని ఏ సెక్షన్ కింద, ఏ విధంగా నమోదు అయిందో అన్న వివరాలు చలానాలో స్పష్టంగా ఉండాలంటూ కోర్టు ఆదేశించింది. కేంద్ర మోటారు వాహన నిబంధన 167 ప్రకారం ఇది తప్పనిసరిగా అమలు చేయాల్సిందే అని న్యాయమూర్తి గుర్తు చేశారు.డిసెంబర్ 9వ తేదీలోగా తీసుకున్న చర్యలు, వ్యవస్థ అభివృద్ధి దశలపై సమగ్ర నివేదికను హోంశాఖ సమర్పించాలని కోర్టు ఆదేశించింది.
ట్రిపుల్ రైడింగ్ (Tripple Riding) చలానాపై వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్ నేపథ్యంలో విచారణ జరిగింది. తార్నాకకు చెందిన వి. రాఘవేంద్రాచారి అనే వ్యక్తి ట్రిపుల్ రైడింగ్ చేసినందుకు విధించిన రూ.1200 జరిమానాపై సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు.పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలో ప్రధాన అంశాలు ఏంటంటే.. మోటారు వాహనాల చట్టం–1988లోని సెక్షన్ 128 రెడ్‌విత్ 177 ప్రకారం ట్రిపుల్ రైడింగ్ జరిమానా రూ.100–300 మాత్రమే. 2019 చట్ట సవరణలను తెలంగాణ (Telangana) ఇంకా అమలు చేయలేదు, కాబట్టి పాత నిబంధనల ప్రకారం మాత్రమే చలానా విధించాలి. చలానాలో ఏ సెక్షన్ కింద జరిమానా విధించారో స్పష్టత లేకపోవడం చట్ట విరుద్ధం అని స్పష్టం చేశారు. ఇరువైపుల వాదనలు విన్న హైకోర్టు సెక్షన్ 184లో జరిమానా రూ.1000 కాగా, పిటిషనర్‌కు రూ.1200 ఎలా విధించారనే అంశాన్ని కూడా పరిశీలించాల్సి ఉందని పేర్కొంది. తదుపరి విచారణను కోర్టు వాయిదా వేసింది.