HomeUncategorizedCabinet Meeting | రేపు కేంద్ర కేబినెట్ స‌మావేశం.. ట్రంప్ సుంకాల నేప‌థ్యంలో కీల‌క భేటీ

Cabinet Meeting | రేపు కేంద్ర కేబినెట్ స‌మావేశం.. ట్రంప్ సుంకాల నేప‌థ్యంలో కీల‌క భేటీ

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Cabinet Meeting | కేంద్ర మంత్రిమండ‌లి శుక్ర‌వారం స‌మావేశం కానుంది. ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ(PM Narendra Modi) నేతృత్వంలో జ‌రిగే ఈ భేటీ ప్రాధాన్యం సంత‌రించుకుంది. అమెరికా వాణిజ్య యుద్ధానికి తెర లేప‌డంతో కేంద్ర ప్ర‌భుత్వం(Central Government) అప్ర‌మ‌త్త‌మైంది. ట్రంప్ టారిఫ్‌ల ప్ర‌భావం, తీసుకోవాల్సిన చ‌ర్య‌ల‌పై కేబినెట్ స‌మావేశంలో ప్ర‌ధానంగా చ‌ర్చ జ‌రుగ‌నుంది. 50 శాతం సుంకాల విధింపు కార‌ణంగా మ‌న దేశీయ సంస్థ‌ల‌పై ప‌డే ప్ర‌భావాన్ఇన ఏ విధంగా ఎదుర్కోవాల‌న్న దానిపై చ‌ర్చించ‌నుంది. అమెరికాతో వాణిజ్య‌, సైనిక‌, మౌలిక రంగాల్లో కీల‌క సంబంధాలు ఉన్న త‌రుణంలో ఏ విధంగా ముందుకెళ్లాల‌నే దానిపై కేబినెట్ ప్ర‌ధానంగా దృష్టి సారించ‌నుంది. అగ్ర‌రాజ్యం సుంకాల మోత మోగిస్తున్న త‌రుణంలో జ‌రుగుతున్న శుక్ర‌వారం జరుగ‌నున్న మంత్రివ‌ర్గ సమావేశం(Cabinet Meeting)పైనే అంద‌రి దృష్టి నెల‌కొంది.

Cabinet Meeting | 50 టారిఫ్ విధించిన ట్రంప్‌..

పాకిస్తాన్‌తో యుద్ధం త‌ర్వాత అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్(US President Donald Trump) భార‌త్‌పై తీవ్ర అక్క‌సు వెళ్ల‌గ‌క్కుతున్నారు. అదే స‌మ‌యంలో ర‌ష్యాతో చెలిమి చేస్తుండ‌డంపై గుర్రుగా ఉన్నారు. మాస్కో నుంచి చౌక‌గా ల‌భిస్తున్న చ‌మురును భారీగా దిగుమ‌తి చేసుకుంటున్న త‌రుణంలో ర‌గిలిపోతున్న ట్రంప్‌.. భార‌త్‌పై వాణిజ్య యుద్ధాన్ని ప్రారంభించారు. అమెరికా భార‌త్ నుంచి దిగుమ‌తి చేసుకునే వ‌స్తువుల‌పై 25 శాతం టారిఫ్‌లు విధిస్తున్న‌ట్లు గ‌త నెల 31న ప్ర‌క‌టించారు. ఈ సుంకాలు అవి గురువారం నుంచి అమ‌లులోకి వ‌స్తున్న త‌రుణంలో .. ట్రంప్ మ‌రోసారి కొర‌డా ఝ‌ళిపించారు. అద‌నంగా మ‌రో 25 శాతం సుంకాలు పెంచుతున్న‌ట్లు తెలిపారు. ర‌ష్యా(Russia) నుంచి చ‌మురు, సైనిక ఉత్ప‌త్తులు కొనుగోలు చేస్తున్నందుకే అద‌న‌పు సుంకాలు విధిస్తున్న‌ట్లు చెప్పారు.

Cabinet Meeting | కీల‌క భేటీ..

రెండుసార్లు క‌లిపి అమెరికా మొత్తం 50 శాతం టారిఫ్‌లు విధించింది. తొలి 25 శాతం గురువారంనుంచి అమ‌లులోకి రానుండ‌గా, మ‌లి విడుత‌లో ప్ర‌కటించిన సుంకాలు ఈ నెల 27 నుంచి అమ‌లులోకి రానున్నాయి. అయితే, ట్రంప్ నిర్ణ‌యం వ‌ల్ల మ‌న ఆర్థిక వ్య‌వ‌స్థ‌పై ప్ర‌తికూల‌ ప్ర‌భావం ప‌డుతుంద‌న్న ఆందోళ‌న‌లు నెల‌కొన్నాయి. అమెరికాకు భార‌త్ భారీగా ఎగుమ‌తులు చేస్తుండ‌గా, దిగుమ‌తులు మాత్రం అంతంత‌గానే ఉన్నాయి. టారిఫ్‌ల పెంపు నేప‌థ్యంలో మ‌న దేశీయ సంస్థ‌ల‌పై భారం ప‌డ‌నుంది. ఇది అంతిమంగా దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ‌పై ప్ర‌భావం చూప‌డంతో వృద్ధి మంద‌గిస్తున్న భావ‌న నెల‌కొంది. ఈ త‌రుణంలోనే కేంద్ర మంత్రివ‌ర్గ స‌మావేశం జ‌రుగుతుండ‌డం ఆస‌క్తి క‌లిగిస్తోంది. ట్రంప్ టారిఫ్‌(Trump Tariff)ల ఎఫెక్ట్ ఏ మేర‌కు ఉంటుంది.. ఏయే రంగాల‌పై ప్ర‌తికూల ప్ర‌భావం చూపుతుంది.. దాన్ని అధిగమించ‌డానికి తీసుకోవాల్సిన చ‌ర్య‌ల‌పై కేబినెట్ భేటీలో చ‌ర్చించి నిర్ణ‌యం తీసుకోనున్నారు. అమెరికాతో వాణిజ్య చ‌ర్చ‌లు కొనసాగిస్తారా.. లేక‌పోతే ప్ర‌తీకార సుంకాలు విధిస్తారా? అన్నది ఆస‌క్తిక‌రంగా మారింది.