అక్షరటుడే, ఆర్మూర్: PDSU | కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దేశంలో విద్యను కార్పొరేట్‌గా (corporateized education) మార్చాయని ప్రగతిశీల మహిళా సంఘం జాతీయ నాయకురాలు సంధ్య అన్నారు. నిజామాబాద్ జిల్లా మహాసభలు శుక్రవారం ఆర్మూర్ పట్టణంలో (Armoor Town) అట్టహాసంగా ప్రారంభమయ్యాయి.
అంతకుముందు ఆర్మూర్ పట్టణంలోని హనుమాన్ ఆలయం నుంచి సీవీఆర్ జూనియర్ కళాశాల వరకు విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. అనంతరం భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భారత రాజ్యాంగం స్వేచ్ఛ, చదువుకునే హక్కు ప్రతి ఒక్కరికి కల్పించిందన్నారు.
PDSU | విద్యాహక్కు చట్టం నిర్వీర్యం
విద్యాహక్కు చట్టాన్ని (Right to Education Act) ప్రభుత్వాలు నిర్వీర్యం చేశాయని ఆమె అన్నారు. బడ్జెట్లో విద్యారంగానికి తక్కువ నిధులు కేటాయిస్తున్నారని ధ్వజమెత్తారు. దేశంలో నిరుద్యోగం పెరిగిపోయి విద్యార్థులను గిగ్ వర్కర్లుగా మారుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థి ఉద్యమాలపై నిర్బంధం పెంచుతున్నారని, ప్రశ్నించే విద్యార్థులపై కేసు నమోదు చేసి జైల్లో వేస్తున్నారని విమర్శించారు. కార్యక్రమంలో పీడీఎస్‌యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగరాజు, జిల్లా అధ్యక్షుడు గౌతమ్ కుమార్, ఆహ్వాన సంఘం అధ్యక్షుడు పస్క నర్సయ్య, ఐఎఫ్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్.దాసు, పీడీఎస్‌యూ జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్, జిల్లా సహాయ కార్యదర్శి ప్రిన్స్, జిల్లా ఉపాధ్యక్షుడు కార్తీక్, విద్యార్థులు పాల్గొన్నారు.