అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Cabinet Meeting | అసెంబ్లీ ఎన్నికల వేళా కేంద్ర ప్రభుత్వం బీహార్ (Bihar)కు భారీగా నిధులు కేటాయించింది. రూ.6 వేల కోట్ల విలువైన రైల్వే, రోడ్డు అభివృద్ధి పనులకు ఆమోదం తెలిపింది.
బీహార్‌లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అక్కడ ప్రస్తుతం ఎన్డీఏ (NDA) అధికారంలో ఉంది. ఏళ్లుగా నితిష్ కుమార్ ముఖ్యమంత్రి పదవిలో కొనసాగుతున్నారు. దీంతో ఆయనపై ప్రజా వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది. మరోవైపు కాంగ్రెస్, ఆర్జేడీ కూటమి సైతం గెలుపే లక్ష్యంగా తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఈ క్రమంలో కేంద్రం బీహార్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని పలు కీలక ప్రాజెక్ట్‌లకు ఆమోదం తెలుపుతోంది.
Cabinet Meeting | డబ్లింగ్ పనులకు రూ.2,192 కోట్లు
ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) అధ్యక్షతన బుధవారం ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశం జరిగింది. ఈ మీటింగ్‌లో తీసుకున్న నిర్ణయాలను కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ మీడియాకు వెల్లడించారు. బిహార్‌లో భక్తియార్‌పుర్-రాజ్‌గిర్-తిలయ్యా రైల్వే లైన్ డబ్లింగ్ పనులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. దీని కోసం రూ.2,192 కోట్లు కేటాయించింది. సాహెబ్‌గంజ్-అరెరాజ్-బెతియా మధ్య 78.9 కి.మీ నాలుగు వరుసల జాతీయ రహదారి నిర్మాణానికి రూ.3822 కోట్లు కేటాయించడానికి కేంద్రం ఆమోదం తెలిపింది.
దేశీయ నౌకా నిర్మాణం, సముద్ర రంగాల పునరుజ్జీవనానికి కేంద్రం ఆమోదం తెలిపింది. ఇందుకోసం రూ.69,725 కోట్ల ప్యాకేజీకి ఓకే చెప్పింది. కాగా ఇటీవల మోదీ మాట్లాడుతూ.. గతంలో దేశంలో నౌకల తయారీ పరిశ్రమ బాగా ఉండగా.. కాంగ్రెస్ పట్టించుకోలేదని విమర్శించారు. ప్రస్తుతం భారత్ నౌకల కోసం దిగుమతులపై ఆధార పడాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. ఈ క్రమంలో కేంద్రం నిధులు కేటాయించడం గమనార్హం.
Cabinet Meeting | భారీగా మెడికల్ సీట్ల పెంపు
దేశవ్యాప్తంగా ప్రభుత్వ వైద్య కళాశాలలను (Medical Colleges) బలోపేతం చేయడమే లక్ష్యంగా కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. కొత్తగా 5వేల పీజీ సీట్లకు ఆమోదం తెలిపింది. కేంద్ర ప్రాయోజిత కార్యక్రమం (CSS) కింద ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 2028-29 నాటికి 5,023 ఎంబీబీఎస్ సీట్లను అదనంగా కేటాయించాలని నిర్ణయించింది.