అక్షరటుడే, వెబ్డెస్క్: Pakistan – Afganistan | కొంతకాలంగా దాడులు, ప్రతిదాడులతో అట్టుడుకున్న పాకిస్థాన్– అఫ్గానిస్థాన్ (Pak – Afghan) మధ్య ఎట్టకేలకు కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. రెండు దేశాల మధ్య శాంతి చర్చలు ఫలించాయి. పాక్- అఫ్గాన్ మధ్య దోహ వేదికగా శాంతి చర్చలు జరిగాయి.
ఈ చర్చల్లో తక్షణ కాల్పుల విరమణకు రెండు దేశాలు అంగీకరించాయి. ఖతార్, తుర్కియే (Qatar and Turkey) మధ్యవర్తిత్వంతో చర్చలు జరిగాయి. ఈ మేరకు ఖతార్ విదేశాంగ మంత్రిత్వశాఖ కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినట్లు ప్రకటించింది. రెండు విడతల్లో జరిగిన చర్చల్లో శాంతి, స్థిరత్వం కోసం కాల్పుల విరమణకు అంగీకరించాయని తెలిపింది. ఈ చర్చల్లో పాక్, అఫ్గాన్ రక్షణ మంత్రులు పాల్గొన్నారు.
Pakistan – Afganistan | అప్పటి నుంచి..
అమెరికా బలగాలు వైదొలిగిన తర్వాత 2021లో అఫ్గానిస్థాన్లో తాలిబన్లు అధికారాన్ని చేజిక్కించుకున్నారు. అప్పటి నుంచి పాక్, అఫ్గాన్ మధ్య ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో ఇటీవల దాడులు పెరిగాయి. పాకిస్థాన్ మొదట కాబూల్పై వైమానిక దాడులు (airstrikes) చేపట్టింది. అనంతరం అఫ్గాన్ ప్రతిదాడులు చేసింది. పలు పాక్ సైనిక పోస్టులను స్వాధీనం చేసుకుంది. దీంతో పాకిస్థాన్ వైమానిక దాడులు చేపట్టగా.. ఇటీవల అఫ్గాన్ క్రికెటర్లు సహా 8 మంది చనిపోయారు. ఈ క్రమంలో రెండు దేశాల మధ్య శాంతి ఒప్పందం కుదిరింది. అక్టోబర్ 25న ఇస్తాంబుల్‌లో మళ్లీ సమావేశం ఉంటుందని ఖతార్ విదేశాంగ శాఖ తెలిపింది.
కాగా శుక్రవారం సరిహద్దు సమీపంలో జరిగిన ఆత్మాహుతి దాడిలో ఏడుగురు పాకిస్తాన్ సైనికులు (Pakistan Army) మరణించగా, 13 మంది గాయపడ్డారని భద్రతా అధికారులు తెలిపారు. తమపై దాడులు చేపడుతున్న ఉగ్రవాదులకు అఫ్గానిస్థాన్ ఆశ్రయం కల్పిస్తోందని పాక్ ఆరోపిస్తుంది. అయితే వీటిని తాలిబన్లు ఖండిస్తున్నారు.